Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్ముకాశ్మీర్ రాజకీయ పార్టీలు
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ ఓటర్ల జాబితాలోకి స్థానికేతరుల్ని చేర్చడానికి, జమ్ముకాశ్మీర్ గుర్తింపును నాశనం చేయడానికి అనుమతించబోమని ఆ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయపార్టీలు స్పష్టం చేశాయి. ఈ విషయంపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని పార్టీలు డిమాండ్ చేశాయి. ఓటర్ల జాబితాలో కొత్తగా సుమారు 25 లక్షల మందిని చేరుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా నివాసం వద్ద గుప్కార్ కూటమి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ నేటి సమావేశంలో పాల్గొన్న ఏ పార్టీ కూడా జమ్ముకాశ్మీర్ ఓటర్ల జాబితాలోకి స్థానికేతరుల్ని చేర్చడానికి అంగీకరించడం లేదని తెలిపారు. 'స్థానికేతరుల్ని ఇక్కడ ఓటు వేయడానికి అనుమతించం. సెప్టెంబర్లో జాతీయస్థాయి పార్టీ నేతల్ని శ్రీనగర్ లేదా జమ్ముకు ఆహ్వానిస్తానం. ఈ విషయాన్ని వారి ముందుఉంచుతాం' అని చెప్పారు. జమ్ముకాశ్మీర్ గుర్తింపును నాశనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఫరూక్ విమర్శించారు. స్థానికేతరులకు ఓటు హక్కు కల్పించడానికి అంగీకరించమని తేల్చి చెప్పారు. 'ఈ రాష్ట్ర గుర్తింపు ముగింపునకు రానున్నది. డోగ్రా, కాశ్మీరీ పహరీ, గుజ్జార్ లేదా సిఖ్ ఇక్కడ నివసించే ఎవరైనా సరే తమ గుర్తింపు కోల్పోతారు. అసెంబ్లీ స్థానికేతరుల చేతుల్లోకి వెళుతుంది. మేం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేం' అని చెప్పారు.
సీపీఐ(ఎం) నాయకులు ఎం వై తరిగామి మాట్లాడుతూ 'ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ), సమాచార శాఖ ఇచ్చిన వివరణ మాకు ఆమోదయోగ్యం కాదు' అని చెప్పారు. 'మేం దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి న్యాయం కోరే అవకాశాలను అన్వేషిస్తాం' అని తెలిపారు. ఈ సమావేశంలో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి, జమ్ముకాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షులు వికార్ రసూల్, సీపీఐ(ఎం) నాయకులు ఎం వై తరిగామి, శివసేన నాయకులు, అవామి నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, జేడీయూ, అకాళీదళ్ మాన్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయుకులు సజాద్ లోన్, అప్ని పార్టీ నేత అల్తాఫ్ బుఖారి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాగా, సవరణల తరువాత రాష్ట్ర ఓటర్ల జాబితాలోకి కొత్తగా సుమారు 25 లక్షల మందిని చేరుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాజాగా వివరణ కూడా ఇచ్చింది. 2022 అక్టోబర్ 1తో 18 ఏళ్ల పూర్తవుతున్నవారికి కొత్తగా ఓటు హక్కు కల్పిస్తున్నట్లు జమ్ముకాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి హిర్దేష్ కుమార్ వివరణ ఇచ్చారు.
కాగా, ఈ గుప్కార్ కూటమి సమావేశానికి వ్యతిరేకంగా సోమవారం బీజేపీ నాయకులు కూడా జమ్ములో సమావేశం నిర్వహించడం విశేషం. స్థానికేతరులకు ఓటు కల్పించడానికి మేం కూడా వ్యతిరేకిస్తాం, అయితే రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు దాటిన అందరికీ ఓటు వేసే హక్కు ఉటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రైనా జమ్ములో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. దీనిపై ఎన్సీ, పీడీపీ, ఇతర పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.