Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ అల్లర్ల దర్యాప్తుపై కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశరాజధానిలో 2020లో చెలరేగిన అల్లర్లలో కొనసాగిన దర్యాప్తు తీరుపై ఢిల్లీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో అల్లర్ల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించి తుపాకి కాల్పులలో గాయపడిన ఫిర్యాదుదారుడినే నిందితుడిగా పేర్కొనటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది అసంబంద్ధమైనదిగా అభివర్ణించింది. అల్లర్ల సందర్భంగా బాధితుడు, ఫిర్యాదుదారుడు అయిన సాజిద్ తప్పించుకునే క్రమంలో తుపాకి కాల్పుల్లో గాయపడ్డాడన్న కారణంతో ఆయనను దర్యాప్తులో నిందితుడిగా చేర్చారని అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ గ్రహించారు. అలా అయితే ఏదైనా అల్లర్ల కేసులో గాయపడిన ప్రతి వ్యక్తినీ నిందితుడిగా చేర్చవచ్చని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2020లో ఈశాన్య ఢిల్లీలో తీవ్ర హింసాత్మక అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని విడుదల చేసే క్రమంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.