Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్‌లో లోపాలు బయటపెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- నాలుగు నెలల తర్వాత కూడా అదే పరిస్థితి!
- ఫలితాన్నివ్వని భారత్ బయోటెక్ యాక్షన్ ప్లాన్
- ఇప్పటికీ ప్రమాణాలు, తయారీ లోపభూయిష్టంగా ఉందన్న డబ్ల్యూహెచ్‌వో
న్యూఢిల్లీ : 'కోవాగ్జిన్' తయారీ పద్ధతులు ఆమోదయోగ్యంగా లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభిప్రాయపడుతోంది. కరోనా వైరస్ బారినపడకుండా రక్షించే కోవాగ్జిన్ టీకా తయారీలో పాటించాల్సిన పద్ధతులు తమకు సంతృప్తికరంగా లేవని మరోమారు స్పష్టం చేసింది. తయారీలో మెరుగైన పద్ధతులు పాటించాలని, ప్రమాణాలు పెరగాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో టీకా తయారుదారు భారత్ బయోటెక్‌కు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలోని ఏ ఏజెన్సీ, విభాగమూ ఈ టీకాను కొనుగోలు చేయరాదని, పంపిణీ చేయవద్దని ఆదేశించింది. దాంతో లోపాల్ని సవరించుకోవటం, ప్రమాణాల పెంపుపై భారత్ బయెటెక్ డబ్ల్యూహెచ్‌వోకు యాక్షన్ ప్లాన్ సమర్పించింది. ఈ యాక్షన్ ప్లాన్‌పై తాజాగా జరిపిన మదింపు, ఇతర సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వో భారత్ ప్రభుత్వానికి అందజేసింది. కాగా దీనికి సంబంధించిన తాజా సమాచారమేదీ తమవద్ద లేదని కేంద్రం చెబుతోంది. కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదముద్ర వేయకపోవటంతో ఈ టీకా సామార్థ్యంపై అనుమానాలు పెరిగాయి. తమ ఏజెన్సీలేవీ కోవాగ్జిన్ కొనటం లేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొనటం సంచలనంగా మారింది. ఏప్రిల్ 2న ఈ ప్రకటన రాగా, నాలుగు నెలలైనా ఈ పరిస్థితిలో మార్పు రాలేదని 'ద వైర్' ఒక వార్తాకథనం వెలువరించింది. కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదముద్ర వేయలేదని తెలిపింది. లోపాల దిద్దుబాటు, ప్రమాణాల పెంపుపై భారత్ బయోటెక్ జూన్16న ఒక యాక్షన్ ప్లాన్‌ను సమర్పించింది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో వర్గాలు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ముఖ్యంగా టీకా నాణ్యతకు గ్యారెంటీ ఇవ్వలేమని నిపుణులు తేల్చారు. ఆమోదయోగ్యం కాని పద్ధతుల్లో టీకాను తయారుచేస్తుంద్నన్న తమ అభిప్రాయం, అంచనాలో మార్పులేదని డబ్ల్యూహెచ్‌వో మరోమారు పేర్కొన్నది. కోవాగ్జిన్‌పై కీలక విషయాల్ని భారత్‌లోని ఔషధ నియంత్రణ, ప్రమాణాల సంస్థ (సీడీఎస్‌సీవో) హెడ్, ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)తో పంచుకున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.కరోనా సంక్షోభం ప్రారంభంలో అత్యవసర వినియోగానికి కోవాగ్జిన్‌కు 3 నవంబర్, 2021న డబ్ల్యూహెచ్‌వో అనుమతి ఇచ్చింది. మార్చి 2022లో డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం హైదరాబాద్‌లోని భారత్ బయెటెక్ టీకా తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది. తయారీ, నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదని బృందం గుర్తించింది. అటు తర్వాత తయారీ పద్ధతుల్లో భారత్ బయెటెక్ అనేక మార్పులు చేసిందని సమాచారం. అయితే ఈ మార్పుల్ని డబ్ల్యూహెచ్‌వో, భారత ప్రభుత్వంతోగానీ పంచుకోలేదు. డబ్ల్యూహెచ్‌వో తనిఖీల నివేదిక సీడీఎస్‌సీవో, డీసీజీఐకి అందాయి. అయినప్పటికీ ఈ నివేదికల సంగతి తమకు తెలియదని కేంద్రం సమాధానమిస్తోంది.