Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాడమిక్ అర్హతలు అవసరం లేదు
- ముసాయిదా మార్గదర్శకాలకు యూజీసీ ఆమోదం
- విద్యానిపుణుల్లో ఆందోళన
న్యూఢిల్లీ : నిపుణులు తమ అనుభవాన్ని ఉపయోగించి ఉన్నత విద్యా సంస్థల్లో బోధించడానికి వివిధ రంగాలకు చెందిన వారిని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా నియమించడానికి ముసాయిదా మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదించింది. మంజూరైన రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులతో పాటు, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అనే కొత్త కేటగిరీ ఫ్యాకల్టీ పోస్టుల కింద యూనివర్శిటీలు, కాలేజీలు త్వరలో పరిశ్రమ నిపుణులను నియమించుకోవచ్చని పేర్కొంది. ప్రాక్టీస్ ప్రొఫెసర్లను నాలుగు సంవత్సరాలకు మించకుండా నిర్ణీత కాల వ్యవధికి నియమించుకుంటారని, వారి సంఖ్య ఏ సమయంలోనైనా మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 10 శాతం మించరాదని యూజీసీ తెలిపింది. ఆగస్టు 18న యూజీసీ 560వ సమావేశంలో కమిషన్ ముసాయిదా మార్గదర్శకాలను ఆమోదించింది. ఆ మార్గదర్శకాలు పబ్లిక్ ఫీడ్‌బ్యాక్‌కు కోసం మంగళవారం విడుదల చేశారు. సెప్టెంబర్‌లో మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కామర్స్, సోషల్ సైన్సెస్, మీడియా, లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, సివిల్ సర్వీసెస్, సాయుధ దళాలు, న్యాయవాద వృత్తి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి వివిధ రంగాలకు చెందిన విశిష్ట నిపుణులను ఈ కొత్త ఫ్యాకల్టీ కేటగిరీలో తీసుకుంటారు.
అకాడమిక్ అర్హత అక్కర్లేదు..
కనీసం 15 ఏండ్ల పాటు నిరూపితమైన నైపుణ్యం కలిగిన నిపుణులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థికి ''అనుకూలమైన'' వృత్తిపరమైన అభ్యాసం ఉంటే ఎటువంటి అధికారిక విద్యా అర్హతలు పరిగణనలోకి తీసుకోనవసరం లేదని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ''ఈ నిపుణులు ప్రొఫెసర్ స్థాయిలో అధ్యాపకుల నియామకం కోసం నిర్దేశించిన ఇతర అర్హత ప్రమాణాల నుంచి కూడా మినహాయించబడతారు'' అని ముసాయిదా మార్గదర్శకాలలో పేర్కొంది. ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్న వారికి ఈ పోస్టులు అందుబాటులో ఉండవు. ప్రాక్టీస్ ప్రొఫెసర్లను ఎంపిక చేసే విధానాన్ని వివరిస్తూ, సంస్థల అధిపతి ప్రముఖ నిపుణుల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తారని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు, ఒక ప్రముఖ బాహ్య సభ్యునితో కూడిన ఎంపిక కమిటీ సూచనలను పరిశీలిస్తుంది. దాని సిఫారసుల ఆధారంగా, ఇన్స్టిట్యూట్ల చట్టబద్ధమైన సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని మార్గదర్శకాలలో పేర్కొంది. ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా చేరిన ప్రారంభంలో ఒక సంవత్సరం వరకు ఉండవచ్చు, అది పొడిగించవచ్చు. ''ఇచ్చిన సంస్థలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సర్వీస్ గరిష్ట వ్యవధి మూడు సంవత్సరాలకు మించకూడదు. అసాధారణమైన సందర్భాల్లో ఒక సంవత్సరం పొడిగించవచ్చు. మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు సంవత్సరాలకు మించకూడదు'' అని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అయితే అకాడమిక్ అర్హత ఉన్నవారికి అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమ వారిని నింపుకోవటానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డదారుల్లో అందలమెక్కిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్ఈపీలో భాగమే ఎం.జగదీష్ కుమార్, యూజీసీ చైర్మెన్
ఈ నిబంధనలు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 అమలులో ఒక భాగమని, ఇది పరిశ్రమ, ఆర్థిక అవసరాలను తీర్చడానికి నైపుణ్య ఆధారిత విద్యపై దృష్టి సారిస్తుందని యూజీసీ చైర్మెన్ ఎం. జగదీష్ కుమార్ తెలిపారు. ''ఇది వాస్తవ ప్రపంచ అభ్యాసాలు, అనుభవాలను తరగతి గదుల్లోకి తీసుకెళ్లడానికి, ఉన్నత విద్యా సంస్థలలో అధ్యాపకుల వనరులను పెంపొందించడానికి సహాయపడుతుంది'' అని ఆయన అన్నారు. ''ఇది ఉన్నత విద్యా సంస్థలను ప్రముఖ వ్యక్తులతో అధికారికంగా అనుబంధించడానికి, అనుభవపూర్వక అభ్యాసం, పరిశోధన, శిక్షణ, నైపుణ్యం, వ్యవస్థాపకత, విస్తరణలో పాల్గొనడానికి, మార్గదర్శక పాత్రను పోషించడానికి వారిని ప్రోత్సహిస్తుంది'' అని తెలిపారు.