Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏది సంక్షేమం, ఏది ఉచితమనేది నిర్ణయించాలి
- ఇదే ముఖ్యమైన అంశం, దీనిపై చర్చ జరగాలి
- దేశ శ్రేయస్సు కోసం ఈ సమస్యను వింటాం : సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం
న్యూఢిల్లీ : గ్రామీణ పేదలకు ఇచ్చే వాటిని ఉచితాలనలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఏది ఉచితం, ఏది సంక్షేమం అనేది నిర్ణయించాల్సిన అవసరం ఉన్నదని ఉందని పేర్కొంది. ఉచితాలనేది చాలా ముఖ్యమైన అంశమనీ, దీనిపై చర్చ జరగాలని సుప్రీం కోర్టు తెలిపింది. దేశ శ్రేయస్సు కోసం, ఈ సమస్యను వింటున్నామని పేర్కొంది. ఎన్నికల ప్రచారం సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేయడాన్ని అనుమతించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సిటి రవి కుమార్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. గ్రామీణ పేదరికంలో ఉన్న వ్యక్తికి ఉచితాలు చాలా ముఖ్యమని స్ఫష్టం చేశారు. అయితే ఈ సమస్యపై విస్తృత బహిరంగ చర్చను ప్రారంభించడమే కోర్టు ఉద్దేశమనీ, దాని కోసమే నిపుణుల కమిటీ వేస్తే ఎలా ఉంటుందని ప్రతిపాదించామని తెలిపారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్కు నేరుగా ఈ కేసులో ప్రమేయం లేనప్పటికీ, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రి తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని సూచనలను అందించాలని ధర్మాసనం ఆహ్వానించింది. ''తాము ఏ ప్రభుత్వ విధానానికీ వ్యతిరేకం కాదు. ఏ పథకానికి వ్యతిరేకం కాదు. రాష్ట్రాలు ఉచితాలు ఇవ్వకూడాదని కేంద్రం చట్టం చేస్తే, అప్పుడు ఆ చట్టం న్యాయ పరిశీలనకు రాదని చెప్పి తప్పించుకోగలమా? ప్రజా సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ రెండింటి ప్రయోజనాల.దృష్ట్యా మేము ఈ అంశాన్ని పరిశీలించడం ప్రారంభించాం. ఇప్పుడు చర్చ జరగాలి. ఒక కమిటీ వేయాలి'' అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ''ఈ సమస్యను వ్యవస్థ ద్వారా పరిష్కరించాలి'' అని పేర్కొన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సంక్షేమానికి సంబంధించి ఎవరికీ సమస్య లేదని, ఒక పార్టీ చీరలు, టెలివిజన్ సెట్లు మొదలైన అనవసరమైన వస్తువులను పంపినీ చేసినప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నాయనీ, న్యాయపరమైన సమస్యను రాజకీయ సమస్యగా మారుస్తున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. ఆప్ తరపున న్యాయవాది అభిషేక్ మాన్ సింఘ్వీ ఎన్నికల వాగ్దానాలపై పరిమితి విధించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇది ఆర్టికల్ 19(1)(ఎ)పై దాడి చేయడమేనని పేర్కొన్నారు. డీఎంకే తరపు సీనియర్ న్యాయవాది పి విల్సన్ అట్టడుగున ఉన్న వ్యక్తులను ఉద్ధరించడానికి ఉద్దేశించిన సంక్షేమ చర్యలను ఉచితాలుగా పేర్కొనలేమని అన్నారు. బడా కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ, పన్ను మినహాయింపులు ఉచితాలుగా ఉంటాయా? లేదా? కోర్టు పరిశీలించాలని కోరారు. ఈ సమయంలో సుప్రీం కోర్టుపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజ్ చేసిన వ్యాఖ్యలపై సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ మండిపడ్డారు. ''మీరు ప్రాతినిధ్యం వహించే పార్టీకి నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ నేను సిజెఐ అయినందుకు నన్ను నేను ఆపుకుంటున్నా. నీది ఒక్కటే తెవివైన పార్టీ అనుకోవద్దు. మీ పార్టీ నేత మాట్లాడుతున్న తీరు, ఇచ్చే ప్రకటనలు విస్మరిస్తున్నామని అనుకోవద్దు'' అని సీజేఐ అన్నారు. సుమారు గంటపాటు జరిగిన విచారణ అనంతరం, కేసు విచారణను నేటీ (బుధవారం)కి వాయిదా వేశారు.