Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నాయకురాలు సుభాషిణీ అలీ, మరో ఇద్దరు పిటిషన్లు
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో 11మంది దోషుల విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించినట్టు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. హత్యానేరం, లైంగికదాడి కేసులో దోషులగా తేలినవారిని విడుదల చేయవద్దంటూ సీపీఐ(ఎం) నాయకురాలు సుభాషిణీ అలీ, మరో ఇద్దరు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దోషులకు ఇచ్చిన క్షమాభిక్షను వెనక్కి తీసుకునేలా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు, మహిళా హక్కుల కార్యకర్తలు, చరిత్రకారులు సుప్రీంను కోరుతున్నారు. ఈ కేసు వివరాల్ని సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీసుకురాగా, విచారణకు ఆమోదం తెలిపారు. 2002 నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై లైంగికదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అత్యంత అమానవవీయ ఈ ఘటనలో దోషులకు న్యాయస్థానాలు జీవిత ఖైదు విధించగా, ఆగస్టు 15 సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఇటీవల దోషులకు క్షమాబిక్ష ప్రసాదించి విడుదల చేసింది. వారి విడుదలను వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి. ఈ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2002 గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ లైంగికదాడి, హత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని కొంతమంది దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్బానోపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసులో 11మంది నిందితులకు సీబీఐ ప్రత్యేకకోర్టు జనవరి 21, 2008న జీవిత ఖైదు విధించింది. దోషులుగా వారు 15ఏండ్లు కారాగారంలో గడిపారు. అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ (ఆగస్టు 15న క్షమాభిక్ష) మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫారసు చేశారు. ఈమేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో గోద్రా సబ్ జైలు నుంచి ఇటీవల విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ బానో, ఆమె భర్త తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.