Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాకేశ్ తికాయత్ రెండు పైసలకు కూడా కొరకాడు
- రైతులను ఉద్దేశించి కేంద్రమంత్రి అజరు మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రైతులపై, రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్‌పై కేంద్ర మంత్రి అజరు మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''రాకేశ్ తికాయత్...రెండు పైసలకు కూడా కొరకాడు. కారులో వెళ్తుంటే..కుక్కలు మొరుగుతాయి, వెంబడిస్తాయి. వాటిని పెద్దగా పట్టించుకోను''..అంటూ అజరు మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఆశిష్ మిశ్రా జైలు పాలవటంతో ఆ అక్కసుతో రైతులపై, రాకేశ్ తికాయత్‌పై కేంద్రమంత్రి ఈవిధంగా మాట్లాడుతున్నారని వార్తలు వెలువడ్డాయి. లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటన తర్వాత ఆయన రైతు ఉద్యమం, రైతులపై ఇష్టమున్నట్టుగా మాట్లాడుతున్నారు. మంగళవారం లఖింపూర్ ఖేరీలో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అజరు మిశ్రా పై వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేంద్ర మంత్రి తీరును అనేకమంది తప్పుబడుతున్నారు.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే..''రాకేశ్ తికాయత్ గురించి నాకు అంతా తెలుసు. అతడి విలువ రెండు పైసలు కూడా చేయదు. రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు. అలాంటి వ్యక్తి ఏదో నిరసనకు దిగితే..నేను స్పందించను. కారులో వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. వెంబడిస్తాయి'' అని అన్నారు. రెండు రోజుల క్రితం సంయుక్త కిసాన్ మోర్చా లఖింపూర్ ఖేరీలో నిరసన కార్యక్రమం జరిపింది. ఈ సందర్భంగా రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ, లఖింపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజరు మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాకేశ్ తికాయత్‌ను టార్గెట్ చేస్తూ తాజాగా అజరు మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాకేశ్ తికాయత్ స్పందించారు. ''నేను చాలా చిన్న వ్యక్తిని. ఆయన చాలా పెద్దవారు. లఖింపూర్ నిరసనకు 50వేలమందిని తీసుకొచ్చాను. అది ఆయన జీర్ణించుకోవటం లేదు'' అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ''లఖింపూర్ ఖేరీలో గూండారాజ్ నడుస్తోంది. ప్రజలు భయంతో బతుకుతున్నారు. అతడి చేతుల నుంచి లఖింపూర్‌కు స్వేచ్ఛను ప్రసాదించటమే మా లక్ష్యం'' అని అన్నారు.