Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ సర్కార్ రాష్ట్రాలపై ఎలాగైనా పెత్తనం చెలాయించాలనుకుంటోంది. అధికారాలు, విధులు మొదలు.. ప్రతి అంశంతోనూ రాజకీయం చేసి..రాష్ట్రాల హక్కులను హరించే దిశగా అడుగులేస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టడానికి అడ్డదారులు వెతుకుతోంది. ఇప్పుడు పెట్టుబడి నిధులపై కూడా కేంద్రం కొత్త పేచీ పెట్టింది. సీఎంల ఫోటోలు పెట్టకుండా..అందుకు ఒప్పుకున్నట్టు సంతకం చేయాలంటోంది. ప్రజాస్వామ్య దేశంలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేందుకు కేంద్రం సిద్ధమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- పెట్టుబడి నిధులపై కేంద్రం మెలిక
- సీఎం ఫోటో ఉండటానికి వీల్లేదు..
- ఒప్పుకుంటూ సంతకం చేస్తేనే నిధుల విడుదల
- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక బ్రాండింగ్‌కు నో..
- రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోన్న మోడీ సర్కార్
న్యూఢిల్లీ : సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా మోడీ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు ప్రత్యేక సాయం కింద ఇస్తామన్న పెట్టుబడి నిధుల విడుదలలో కొత్త పేచీ పెట్టింది. కేంద్రం ప్రకటించిన ఈ పథకం కింద రాష్ట్రాలు నిధులు కోరదలుచకుంటే, ఆ నిధులను ఉపయోగించిన చోట ఆ రాష్ట్ర సీఎం ఫొటోగానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రచార ముద్ర (బ్రాండింగ్)గానీ ఉపయోగించరాదని నిబంధన విధించింది. 'ప్రత్యేక సాయం కింద రాష్ట్రాలకు పెట్టుబడి నిధులు' పథకంలో రెండు రైడర్లను కేంద్రం జోడించింది. ఈ రైడర్లను ఒప్పకుంటేనే ఆ రాష్ట్రానికి నిధులు మంజూరు అవుతాయని న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద ప్రింట్' వార్తా కథనం పేర్కొన్నది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 'ప్రత్యేక సాయం కింద రాష్ట్రాలకు పెట్టుబడి నిధులు' పథకాన్ని ప్రకటించారు. 50 సంవత్సరాల వ్యవధితో కూడిన వడ్డీలేని లక్ష కోట్ల రూపాయల నిధులు రాష్ట్రాలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.30వేల కోట్లు ఇస్తామన్నారు. అయితే ఈ పథకం అమలుతీరుపై కేంద్రం తాజాగా కొన్ని వివరాలు బహిర్గతం చేసింది. పథకం కింద నిధులు పొందాలనుకుంటే రెండు రైడర్స్‌కు రాష్ట్రాలు ఓకే చెప్పాలి. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మేంట్ వ్యవస్థలోని సింగిల్ నోడల్ ఏజెన్సీ డ్యాష్‌బోర్డ్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు సమాచారమంతా పంచుకోవాలని 'మొదటి రైడర్' స్పష్టం చేసింది.
కేంద్రం చెప్పినట్టు చేయాలి..అంతే
పెట్టుబడి సాయం ద్వారా వచ్చిన నిధులను రాష్ట్రాలు ఏ పథకానికి వినియోగిస్తారో, ఆ పథకంలో రాష్ట్రాల ప్రత్యేక బ్రాండింగ్ ఉండరాదని, దీనికి అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సంతకం చేయాలని 'రెండో రైడర్' చెబుతోంది. అలాగే సీఎం ఫొటోను సైతం వాడరాదని పేర్కొన్నది. ''అనేక రాష్ట్రాలు కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూ తమ తమ స్వంత పథకాలు అమలుజేస్తున్నాయి. పథకాల్ని అమలుజేస్తున్నది ముఖ్యమంత్రేనని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇకపై అలా జరగడానికి వీల్లేదు'' అంటూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. కేంద్రం ఆమోదించిన బ్రాండింగ్ మాత్రమే రాష్ట్రాలు అమలుజేయాల్సి ఉంటుందన్నారు. మంజూరైన నిధుల్ని రెండు వాయిదాల్లో రాష్ట్రాలకు విడుదల చేస్తామన్నారు. నిధులను వేరే పథకాలకు మళ్లించటంపై కేంద్రం అనుమతి ఉన్నా, కేంద్ర ప్రభుత్వ బ్రాండింగ్‌నే ఉపయోగించాలని చెప్పారు.
ఉదాహరణకు తమిళనాడులో మహిళా సంఘాలకు ఇచ్చే రుణ సాయం పథకం కోసం 'కేంద్ర పెట్టుబడి నిధులు' వాడాలని నిర్ణయిస్తే. అప్పుడు ఈ పథకాన్ని అమలుజేస్తున్నది రాష్ట్రామేనని అక్కడి ప్రభుత్వం ప్రచారం చేయడానికి వీల్లేదు.
రాష్ట్ర ప్రచార లోగో వాడరాదు. ఆ రాష్ట్ర సీఎం ఫొటో ముద్రించరాదు. కేంద్రం ఇచ్చిన ప్రచార ముద్ర (బ్రాండింగ్)ను మాత్రమే వాడాలి. మరో వివాదాస్పద నిర్ణయం ఏమంటే, కేంద్రం ఇస్తామంటున్న రూ.లక్ష కోట్ల పెట్టుబడి నిధుల్లో రూ.80వేల కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కోతపెడుతోంది. తాము చెప్పిన ప్రభుత్వ పాలనా సంస్కరణలు అమలుజేస్తే మిగతా రూ.20వేల కోట్లు రాష్ట్రాలకు అందుతాయి.