Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలి
- సిజిహెచ్ఎస్పై పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలి
- ఏఐబీడీపీఏ చలో ఢిల్లీ
న్యూఢిల్లీ: 15 శాతం ఫిట్మెంట్తో పెన్షన్ సవరించాలని, వైద్య ప్రయోజనాలను సకాలంలో చెల్లించేలా హామీ ఇవ్వాలని ఏఐబీడీపీఏ నేతలు విఎఎన్ నంబూద్రి, కెజి జయరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం పెన్షనర్స్ అసోసియేషన్ (ఏఐబీడీపీఏ) ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం జరిగింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది పెన్షనర్లు పాల్గొంటారు. తొలిత ఈస్ట్రన్ కోర్ట్ కాంప్లెక్స్ ఆవరణంలో ఆందోళన ప్రారంభమైంది. అక్కడ నుంచి పెన్షనర్లంతా సంచార్ భవన్ (కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కార్యాలయం)కు మార్చ్ నిర్వహించాలని ప్రయత్నించారు. అయితే ఢిల్లీ పోలీసులు ఈస్ట్రన్ కోర్ట్ వద్ద గేట్లు మూసివేసి, పెన్షనర్లను అడ్డుకున్నారు. దీంతో పెన్షనర్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ర్యాలీని సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు ప్రారంభించారు. దేశంలో మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐబీడీపీఏ నిర్వహిస్తున్న ఆందోళనలకు సిఐటియు పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వర్కర్స్ సమాఖ్య సెక్రటరీ జనరల్ ఆర్ ఎన్ పరాశర్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి అభిమన్యు, పెన్షనర్స్ అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ జనరల్ కె.కె.ఎన్ కుట్టి, ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె రాఘవేంద్రన్, బిఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అనిమేష్ మిత్ర తదితరులు ప్రసంగించారు. 2017 జనవరి 1 నుండి పదవీ విరమణ పొందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు పెన్షన్ను సవరించాలని, గత నాలుగేండ్లుగా బీఎస్ఎన్ఎల్లో పదవీ విరమణ చేసిన వారికి వైద్య ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల వేతన సవరణ నుండి పెన్షన్ సవరణను విడదీస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నుండి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు. పింఛను,పెన్షనరీ ప్రయోజనాల చెల్లింపు కోసం అవసరమైన నిధి ఇప్పటికే పింఛనుదారుల జీతం నుండి వారి సర్వీస్ సమయంలో సేకరించిన మొత్తం ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు. పదవీ విరమణ పొందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వైద్య ప్రయోజనాల నిరాకరిస్తున్నారని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్ మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం ప్రకారం ఉద్యోగి, పదవీ విరమణ పొందినవారు సమానంగా వైద్య ప్రయోజనాలకు అర్హులని పేర్కొన్నారు. కానీ పదవీ విరమణ పొందిన వారికి గత ఐదేండ్లు గా మెడికల్ బెనిఫిట్స్ చెల్లింపులో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. పదవీ విరమణ పొందిన వారి క్లెయిమ్లు గత నాలుగేండ్లు గా పెండింగ్లో ఉండడంతో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పింఛనుదారులను సిజిహెచ్ఎస్ (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం)కి మారమని ఒత్తిడి చేసేందుకు బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని దుయ్యబట్టారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంతో సిజిహెచ్ఎస్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అరుదుగా ఆసక్తి చూపుతుందని విమర్శించారు. మహారాష్ట్రలోని విఆర్ఎస్ తీసుకున్న వారికి పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐబీడీపీఏ నేతలు సంజీబ్ బెనర్జీ, ఆర్ఎస్ చౌహాన్, ఆర్. మురళీధరన్ నాయర్, డిపిఎస్ సిసోడియా, టిఎ బిజు తదితరులు పాల్గొన్నారు.