Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ 'ఫోర్టిఫైడ్ బియ్యం' అనేది సరికాదు
- శాస్త్రీయంగా ఆధారాల్లేవ్ : ఆషా, రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్
న్యూఢిల్లీ : రక్తహీనతతో బాధపడుతున్నవారికి 'ఫోర్టిఫైడ్ రైస్'ను ప్రజా పంపిణీ (పీడీఎస్) ద్వారా అందజేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. అయితే కేంద్రం ఎంచుకున్న విధానం లోపభూయిష్టంగా వుందని ద అలయన్స్ ఫర్ సస్టెయినబుల్, హాలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా), రైట్ టు ఫుడ్ క్యాంపెయినర్ విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రక్తహీనత, ఇతర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య కేవలం 'ఫోర్టిఫైడ్ రైస్' పంపిణీ చేయటం ద్వారా పరిష్కారం కాదని, శాస్త్రీయమైన ఆధారాల్లేవని ఆషా, రైట్ టు ఫుడ్ క్యాంపెయినర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్‌లో 'ఫోర్టిఫైడ్ రైస్'ను అందజేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, కేంద్ర మహిళా, బాలల అభివృద్ధి శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలకు సర్యూలర్స్ జారీచేశాయి.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 'ఫోర్టిఫైడ్ రైస్' పంపిణీ చేసేందుకు సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆ సర్క్యూలర్స్‌లో కేంద్రం ఆదేశించింది. 'ఫోర్టిఫైడ్ రైస్' పంపిణీకి సంబంధించి కేంద్రం 2019లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. గత మూడేండ్లుగా ఈ పైలట్ ప్రాజెక్టులు 15 రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. వీటిపై సంపూర్ణమైన నివేదిక రాకుండానే దేశవ్యాప్తంగా 257 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్‌ను పంపిణీ చేయబోతున్నామని ఏప్రిల్‌లో కేంద్రం వెల్లడించింది. అయితే ఆహార నిపుణులు, వివిధ అధ్యయనాలు చెబుతున్నదాన్నిబట్టి, కేవలం ఫోర్టిఫైడ్ రైస్ ఆహారంగా తీసుకున్నంత మాత్రాన ఒక వ్యక్తిలో రక్తహీనత పోదని తేలింది.
మంచి కన్నా చెడే ఎక్కువ : ఆషా, రైట్ టు ఫుడ్ క్యాంపెయినర్
ఫోర్టిఫైడ్ రైస్ ప్రాజెక్టుకు సంబంధించి అనేకమార్లు ఆర్టీఐ దరఖాస్తులు వెళ్లాయి. దేనికీ కేంద్రం సరైన సమాచారం విడుదల చేయలేదు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలపై విశ్వసనీయ సమాచారం లేదు. ఈ తరహా బియ్యం ప్రజలందరికీ అవసరమా? లేదా? అన్నది ముందు తెలియాలి. ఉదాహరణకు తలసేమియా వ్యాధితో బాధపడేవారికి 'ఫోర్టిఫైడ్ రైస్'ను ఆహారంగా ఇస్తే ప్రమాదం. ఇందులోనూ సికిల్ సెల్ అనీమియాతో బాధపడేవారు అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే లివర్ దెబ్బతింటుంది. ఫోర్టిఫైడ్ రైస్‌లో ఉండే ఐరన్ పోషకం రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి కాకుండా, శరీరంలో ఐరన్ పెరగడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్తోంది. రక్తహీనత నుంచి బయటపడాలంటే సమతుల ఆహారం తీసుకోవటం తప్పనిసరి.