Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు
చండీగఢ్ : విద్యార్థులకు బడులను దూరం చేసే ప్రక్రియ హర్యానాలో వేగంగా అమలవుతోంది. దీనిని నిరసిస్తూ ఆ రాష్ట్రంలో సోమ, మంగళ, బుధవారాల్లో ఆందోళనలు మిన్నంటాయి. పలుచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యమిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ చర్యపై మండిపడుతున్నాయి.
ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖతర్ మాట్లాడుతూ ఒకే భవనంలో నడుస్తున్న 1 నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రభుత్వ బడులను ఒకటిగా విలీనం చేస్తామని చెప్పారు. ఈ పాఠశాలలకు హెడ్ కూడా ఒకరే ఉంటారని తెలిపారు. ఒకే భవనంలో ఉన్న ప్రాథమిక, ఉన్నత, సీనియర్ సెకండరీ పాఠశాలలను విలీనం చేస్తున్నామని, దీనికి సంబంధించి త్వరలో కొత్త వ్యవస్థను అమలు చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను కూడా హేతుబద్ధీకరిస్తామన్నారు. దీంతో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని, ఇంకా కొరత ఉంటే భర్తీ చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్న మాధ్యమిక, ఉన్నత తరగతి ప్రభుత్వ పాఠశాలలను మూడు కిలోమీటర్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ బడుల్లో విలీనం చేసేందుకు ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది.
అసలేంటీ బడుల విలీన పథకం..?
25 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులున్న 105 ప్రభుత్వ మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను.. మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ బడుల్లో విలీనం చేస్తూ ఈ నెల 13న హర్యానా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ పథకం ప్రకారం.. 6 నుంచి 8వ తరగతి వరకు 20 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, 9 నుంచి 12వ తరగతి వరకు 25 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను, మూడు కిలోమీటర్ల సమీపంలోని ప్రభుత్వ మాధ్యమిక, ఉన్నత, సెకండరీ పాఠశాలల్లో విలీనం చేస్తుంది. ఇది భౌతికంగా పాఠశాలను విలీనం చేయడంతో పాటు దీనివల్ల విద్యార్థుల ప్రయోజనం, సౌలభ్యం కోసం చేసే ప్రభుత్వ మౌలిక సదుపాయాలను దూరం చేస్తుంది. పథకంలోని మరొక కోణం ఏమిటంటే.. ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలల విలీనం. ఇది అత్యధిక కేటగిరి పాఠశాలల్లో ఏకీకృతం చేయబడి, వాటిని సింగిల్ స్కూల్ యూనిట్‌గా మారుస్తుంది. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులను గరిష్టంగా వినియోగించుకోవడమే లక్ష్యమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కన్వర్పాల్ తెలిపారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు
ఈ విలీనం ముఖ్యంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలిపారు. హర్యానా విద్యాలయ అధ్యాపక్ సంఫ్‌ు ప్రధాన కార్యదర్శి ప్రభు సింగ్ మాట్లాడుతూ.. 'విలీన ప్రక్రియలో.. అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. చాలా మంది పేదలు.. బడులు తమ నివాసాలకు దగ్గర ఉంటే.. తమ పిల్లలను అక్కడకు పంపేందుకు ఇష్టపడతారు. ఇప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. హాజరయ్యే వారి సంఖ్యపై ప్రభావం చూపుతుంది. రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ (ఆర్టిఇ) చట్టం ప్రకారం.. ప్రస్తుతం పాఠశాలల్లో 1:35 నిష్పత్తి (ఉపాధ్యాయుడు-విద్యార్థులు) ఉండాలి, కానీ 1 : 50 కాదని పేర్కొన్నారు. అధ్యాపక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు వజీర్ సింగ్ మాట్లాడుతూ పాఠశాలల్లో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గదని చెప్పారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇష్టపడకుండా, విలీన ప్రక్రియ చేపట్టిందని అన్నారు. విలీన బడులైన అన్ని ఉన్నత పాఠశాలలకు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఒకరే ఉంటారని అధ్యాపక్ సంఫ్‌ు పేర్కొంది. ఈ పథకం కొనసాగితే మరిన్ని పాఠశాలలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అంతిమంగా పాఠశాల విద్య ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా కొన్ని పాఠశాలల్లో సైన్స్, మాథ్స్ టీచర్లు లేకుండా పోయారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు
ఈ విలీన ప్రక్రియపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిస్సార్‌లోని పర్చువాలా గ్రామంలో సైన్స్, ఇంగ్లీష్, మేథ్స్ టీచర్ పోస్టులు రద్దు చేయడంతో పాఠశాల గేటుకు తాళం వేశారు. ఝజ్జర్‌లోని ముండాఖేరాసహా పలుచోట్ల గ్రామస్తులు పాఠశాలలకు తాళాలు వేసి, ఆందోళనలు చేశారు.
ప్రభుత్వ చర్యపై కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు మండిపడుతున్నాయి. ప్రైవేటీకరణను ప్రోత్సహించడం, పేదలకు విద్యను నిరాకరించడం లక్ష్యంగా విలీనం చేపడుతున్నారని విమర్శించాయి.
రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసిందని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా విమర్శించారు.