Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుపతిలో నేడు, రేపు కార్మికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశం
- కార్మిక సంఘాల అభ్యంతరాల్ని పట్టించుకోని కేంద్రం
న్యూఢిల్లీ : లేబర్కోడ్స్పై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నవేళ, మోడీ సర్కార్ ఏకపక్షంగా ముందుకువెళ్తోంది. లేబర్ కోడ్స్ అమలుతీరుపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడానికి సిద్ధమైంది. నేడు, రేపు రెండు రోజులపాటు తిరుపతిలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రాల కార్మికశాఖ మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులు పాల్గొనబోతున్నారు. లేబర్కోడ్స్ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొచ్చేందుకు మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది. తిరుపతిలో నేడు ప్రారంభం కానున్న రెండు రోజుల సమావేశాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. లేబర్కోడ్స్ను సీఐటీయూ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాలు అమల్లోకి తీసుకొస్తే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని కార్మికసంఘాలు ప్రకటించాయి. అయితే కార్మిక సంఘాల అభ్యంతరాల్ని, ఆందోళనను పట్టించుకోకుండా, రాష్ట్రాల్ని ఒప్పిస్తే చాలు..అనే ధోరణిలో కేంద్రం ముందుకు వెళ్తోంది. మొదటి నుంచీ లేబర్కోడ్స్పై కార్మికసంఘాలతో కేంద్రం ఎలాంటి సంప్రదింపులూ, చర్చలు జరపకుండా కాలం గడుపుతోందని సమాచారం. గత కొద్ది రోజులుగా కేంద్ర కార్మికమంత్రి భూపేందర్ యాదవ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. రాష్ట్రాల నుంచి అధికారికంగా ఆమోదముద్ర వేశాక, అటు తర్వాత కార్మిక సంఘాలతో చర్చిస్తారని కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు ఒప్పుకున్నాక, ఎవరు ఆగమన్నా ఆగదనే బెదిరింపుతో ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి.