Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
- ప్రభుత్వమే కమిటీ వేయొచ్చు కదా..?
- దేశంలో పదవీ విరమణ చేసిన వారికి విలువ లేదు : సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ: ఎన్నికల ఉచితాలకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు చేయడాన్ని అనుమతించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సిటి రవి కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ ఈ సమస్య అధ్యయనం కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసే నిపుణుల కమిటీకి చైర్మె న్గా సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లోధా వంటి వారిని వేయాలని సూచించారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పదవీ విరమణ చేసిన, పదవీ విరమణ చేయబోతున్న వ్యక్తికి ఈ దేశంలో విలువ లేదని అన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ ''ఒక రాజ్యాంగ సంస్థ ఉద్దేశపూర్వకంగా కమిటీకి నాయకత్వం వహించాలని నేను భావిస్తున్నాను'' అని అన్నారు. సీజేఐ ఎన్వి రమణ జోక్యం చేసుకొని ''ఈ సమస్యను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక కమిటీని వేయదు?'' అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, మూడు నెలల్లో కమిటీ ఈ అంశంపై నివేదిక సమర్పించగలదని ఎస్జి మెహతా బదులిచ్చారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చట్ట విరుద్ధమైన మూడు రకాల ఉచితాలు ఉన్నాయని వాదించారు. అందులో మొదటిది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేంది. రెండోది పబ్లిక్ పాలసీని ఉల్లంఘించేవి, ఇతర విషయాలతో పాటు కార్పొరేషన్లకు ఇచ్చినవి, అలాంటి సంస్థలు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలకు పాల్పడినవి, మూడోది ఎన్నికల ముందు వాగ్దానాలు ఇస్తున్నట్లుగా ఎన్నికలకు ముందు ఉచితాలు అని పేర్కొన్నారు. ఓటర్లకు లంచం లాంటిదని, ఎన్నికలకు ఆరు నెలల ముందు, ఎన్నికలకు ముందు అసలు ఉచితాలు ఇచ్చినప్పుడు ప్రధాన సమస్య అని ఆయన అన్నారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ రాజకీయ పార్టీలకు ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక రికార్డులు అందుబాటులో ఉండవని, మేనిఫెస్టోలోని వాగ్దానాలకు నిధులు మూలాన్ని వెల్లడించాలనే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం-2003 అమలు చేయడంలో పరిష్కారం ఉందని, లోటు 3 శాతం మించి ఉంటే, ఫైనాన్స్ కమిషన్ దానిని పరిశీలించి, వచ్చే ఏడాది నుంచి కేటాయింపును తగ్గించవచ్చని పేర్కొన్నారు. అధికారం లేని పార్టీలు ఓటర్లను అనవసరంగా ప్రభావితం చేసేలా వాగ్దానాలు చేస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వి రమణ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఉచితాలపై నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయని, ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఫలించకపోవచ్చని తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు. ఉచితాలను అందించడం తమ ప్రాథమిక హక్కుగా భావించే కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఉచితాలను అందించి అధికారంలోకి వచ్చాయని ఎస్జీ పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ఉచితమని దేనిని నిర్వచించవచ్చు? అని ప్రశ్నించారు. ''మానిఫెస్టోలో ఏదైనా ఉంటే, దానిని ఉచితం అని పిలవవచ్చా? ఉచితాల ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి తగినంత మెటీరియల్ అందుబాటులో ఉంది'' అని పేర్కొన్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకొని ''అతిపెద్ద సమస్య ఏమిటంటే, కమిటీకి నాయకత్వం వహించేది ఎవరు? చివరికి రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి. వ్యక్తులు కాదు. నేను పోటీ చేస్తే నాకు పది ఓట్లు కూడా రావు అనుకుందాం. ఎందుకంటే వ్యక్తులకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. మన ప్రజాస్వామ్యం ఎలా ఉందో...ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి రావచ్చు. కాబట్టి వారే వచ్చి దీన్ని నిర్వహించాలి. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉచితాలు మొదలైన వాటిని పరిశీలించాలి. కాబట్టి చర్చ జరగాలి'' అని పేర్కొన్నారు. ఆప్ తరపున సీనియర్ న్యాయవాది అఖిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ఉచితాలతో ఓటర్లను ఆకర్షిస్తారనే సొలిసిటర్ జనరల్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ''ప్రజలందరినీ ఎల్లవేళలా మోసం చేయలేరు. 1947లో మన అక్షరాస్యత రేటు 12 శాతం ఉన్నప్పుడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉంది. మన ఓటర్లు మోసపూరితంగా ఉన్నారని అనుకోవడం తప్పు'' అని పేర్కొన్నారు.
ఇకనుంచి ఈ కేసును విచారించనున్న జస్టిస్ డివై చంద్రచూడ్
ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు వాగ్దానం చేసిన ఉచితాలపై సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యాన్ని ఇప్పుడు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. దీనిపై ఇప్పటివరకు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వి రమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.