Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వాకౌట్..
- ఆర్జేడీ నేతల ఇండ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ : బీహార్‌లో నితీశ్ కుమార్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నితీశ్‌కుమార్ గెలుపొందారు. అయితే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం నితీశ్ ప్రసంగంపై నిరసన తెలిపిన బీజేపీ ఓటింగ్‌కు ముందే సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ ఓటింగ్‌లో నితీశ్ సంకీర్ణ సర్కార్‌కు 160 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో మొత్తంగా 243 స్థానాలుండగా, మహాగట్ బంధన్ కూటమికి 164మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం నితీశ్ మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్కటై విజయం సాధిస్తాయన్నారు.
ఈరోజు ఢిల్లీ బయట జరుగుతున్నదంతా పబ్లిసిటీయేనని అన్నారు. అసలు భారత స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. పత్రికలను స్వతంత్రంగా పనిచేయనివ్వడంలేదని విరుచుకుపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. మార్పు కోసం అందరం కలిసి పనిచేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కేవలం 2020 ఎన్నికల గురించే మాట్లాడొద్దని..అంతకుముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కన్నా జేడీయూ ఎక్కువ సీట్లు గెలుచుకున్న సందర్భాలను గుర్తు చేసుకోవాలని సూచించారు.
బలపరీక్షకు కొద్దిగంటల ముందు సీబీఐ దాడులు
బీహార్‌లో కొత్తగా ఏర్పడ్డ మహాగట్ బంధన్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోవడానికి కొన్ని గంటల ముందే ఆర్జేడీ నేతల ఇండ్లపై సీబీఐ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన 'ల్యాండ్ ఫర్ జాబ్స్' కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీలపై సింగ్ స్పందిస్తూ..''ఇప్పటికే ఒకసారి తనిఖీలు చేశారు. మళ్లీ చేయడంలో అర్థం లేదు. భయభ్రాంతులను సృష్టించి ఎమ్మెల్యేలను వారికి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు. ఇదే కుంభకోణానికి సంబంధించి ఆర్జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్ఫాక్ కరీం ఇంటిపైనా సీబీఐ బుధవారం దాడులు నిర్వహించింది.