Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ గ్రీన్ ఎనర్జీకి ఉదారంగా రుణాలు
- ఆసియాలోనే టాప్-2 పేలవ కంపెనీ
- రుణ ఈక్విటీ నిష్పత్తి ఆందోళనకరం : బ్లూమ్‌బర్గ్ రరిపోర్ట్
ముంబయి : భారత దేశంలో ఓ వ్యక్తి వద్ద ఒక్క రూపాయి ఆస్తి ఉంటే.. అర్థ రూపాయి అప్పు పుట్టడమే కష్టం. మరీ మంచి వాడు అయితే రూ.10 అప్పు పుట్టచ్చేమో.. అదే రూపాయి పెట్టుబడికి .రూ.2,000 పైగా అప్పు దొరకడాన్ని ఎవరూ ఊహించలేరు. కానీ.. గౌతమ్ అదానీ కంపెనీలకు మాత్రం ఇది సాధ్యమవుతోంది. బ్లూమ్‌బర్గ్ తాజా రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడయ్యింది. ఓడ రేవులు, విమానాశ్రయాలు, విద్యుత్, సిమెంట్ తదితర అన్ని రంగాల్లో రాకేట్ వేగంతో వ్యాపార సామాజ్య్రాన్ని విస్తరిస్తోన్న అదానీ గ్రూపు కంపెనీల్లో డొల్లతనం, బలహీనతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గౌతమ్ అదానీ ఏడు లిస్టెడ్ కంపెనీల్లో ఒకటయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అప్పుల నిష్పత్తి బుడగ పేలొచ్చని బుధవారం బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్ట్‌లో విశ్లేషించింది. అదానీ కంపెనీ అప్పులు ప్రమాదకర స్థాయికి చేరాయని ఇంతక్రితం రోజు ఫిచ్ రేటింగ్స్ అనుబంధ సంస్థ క్రెడిట్ సైట్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే. బ్లూమ్‌బర్గ్ తాజా రిపోర్ట్ ప్రకారం.. అదానీ గ్రీన్ ఎనర్జీ రుణాలలు - ఈక్విటీ నిష్పత్తి ఆసియాలోనే అత్యంత పేలవంగా ఉంది. అపారకుబేరుడు అదానీకి చెందిన ఈ కంపెనీ ఆసియాలోనే అత్యంత పేలవ పరపతిని కలిగి ఉంది.
''గుజరాత్ కేంద్రంగా పని చేస్తోన్న అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ రుణాలు- ఈక్విటీ నిష్పత్తి 2,021 శాతంగా ఉంది. అంటే రూ.1 ఈక్విటీ విలువపై రూ.2,021 మొత్తాన్ని అప్పుగా పొందుతున్నారు. ఆసియాలోనే 892 లిస్టెడ్ కంపెనీల రుణ పరపతి విశ్లేషణలో అదానీ గ్రీన్ ఎనర్జీ రెండో అతిపెద్ద పేలవ కంపెనీగా ఉంది. ఇటీవల పునరుత్పాదన ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.60 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడుతున్నట్లు అదానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కుబేరుడి వ్యాపారాల వేగమైన వృద్థి ప్రణాళికలు ఆందోళనకరంగా ఉన్నాయి.'' అని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
ఇప్పటికే ఈ కంపెనీ 2022 మార్చి ముగింపు నాటికి రూ.43,500 కోట్ల అప్పుల్లో ఉంది. ఇంతక్రితం ఏడాది రూ.19,700 కోట్ల అప్పులతో పోల్చితే 119 శాతం పెరుగుదల నమోదయ్యింది. తాజాగా ఈ రంగంలో రూ.5.60 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న ఈ కంపెనీ కొత్త రుణాల వెతుకులాటలో ఉంది. రుణ నిధులతోనే అదానీ గ్రూపు వేగంగా పెరుగుతోందని బ్లూమ్‌బర్గ్ ఇంటిలిజెన్సీ అనలిస్ట్ షరోన్ చెన్ గత నెలలో పేర్కొన్న విషయం తెలిసిందే. మూడో వ్యక్తి ఇచ్చిన అప్పులతోనే పెట్టుబడులు పెడుతోందన్నారు.
భారీగా అప్పులు తెచ్చి కొత్త వ్యాపారాల్లో దూకుడుగా పెట్టుబడులు పెడుతోన్న గౌతమ్ అదానీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు లేకపోలేదని ఫిచ్ గ్రూపునకు చెందిన క్రెడిట్ సైట్స్ మంగళవారం ఓ రిపోర్ట్‌లో విశ్లేషించిన విషయం తెలిసిందే. అప్పులతో ఆ సంస్థ రుణ ప్రమాణాలు, కొలమానాలు, నగదు ప్రవాహం (క్యాష్ ఫ్లో) అంశాలు ఒత్తిడికి గురైతున్నాయని పేర్కొంది. ఒక వేళ ఇదే విధానం కొనసాగితే.. పరిస్థితి చేజారి పోవచ్చని.. మున్ముందు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. బ్యాంక్‌లతోనూ బలమైన సంబంధాలు కలిగి ఉందని ఈ నివేదికలో పేర్కొంది. మోడీ ప్రభుత్వంతో అదానీ బలమైన సంబంధాలు కలిగి ఉండటంతో పాలసీ విధానాల్లోనూ లబ్ది పొందుతున్నారని గుర్తు చేసింది.