Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రసంగాలు అద్భుతం
- జాతీయ ప్రాముఖ్యత అంశాలపై ఎటువంటి చర్యలు లేవు
- మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
- న్యాయమూర్తుల నియామకం చారిత్రాత్మకం
- రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన మొదటి తెలుగు వ్యక్తి
- దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతిగా జస్టిస్ ఎన్వి రమణ రేపు పదవీ విరమణ
న్యూఢిల్లీ : దేశ 48వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలల (489 రోజులు)పాటు బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎన్వి రమణ రేపు (శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఆయన పాలనాకాలంలో చెప్పుకోదగ్గ, ఆశించిన విధంగా గొప్ప తీర్పులేమీ ఇవ్వలేదు. కాకపోతే ఆయన మౌలిక సదుపాయాల గురించి ప్రత్యేక దృష్టి పెట్టారు. న్యాయవ్యవస్థలో ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాల లేమీని గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్‌లో కోర్టు కాంప్లెక్స్‌లు, జిల్లా కోర్టు భవనాలు ప్రారంభించారు. న్యాయస్థానాల్లో మహిళకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మహిళా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారించేందుకు చర్యలు చేపట్టారు. సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ కాలంలో కరోనా మహ్మరి విలయతాండవం ప్రధాన సవాల్‌గా నిలిచింది. ఈ సవాల్‌ను కూడా అదిగమించి కేసుల విచారణకు పూనుకున్నారు. ఒకానొక సమయంలో కరోనా కేసులు తీవ్రతరమవ్వడంతో దేశమంతా భయాందోళనలు నెలకొన్నాయి. అప్పుడు కూడా కేసుల విచారణకు ప్రత్యామ్నాయ మార్గాలను చూశారు. భౌతిక విచారణ ఇక కుదరదని భావించి, ప్రత్యేక యాప్‌ను తయారు చేయించి, ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించారు.
250 మంది న్యాయమూర్తుల నియామకం
2021 ఏప్రిల్ 24న సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎన్వి రమణ, పెరుగుతున్న కేసుల పెండింగ్‌కు ప్రధాన సమస్యను గుర్తించారు. అందుకు గల కారణాలను అన్వేషించి, చర్యలకు నడుం బిగించారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం ఒక చారిత్రాత్మకమని చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా నియమాకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా హైకోర్టులకు 250 మంది న్యాయమూర్తులను భర్తీ చేశారు. సుప్రీం కోర్టులో 11 మంది న్యాయమూర్తులను భర్తీకి పూనుకున్నారు. అందులో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ మహిళా సాధికారితకు బాటలు వేశారు. సుప్రీం కోర్టులో నలుగురు మహిళ న్యాయమూర్తులు నియమించారు. అందులో ఒకరు దేశానికి మహిళా (జస్టిస్ బివి నాగరత్నం) ప్రధాన న్యాయమూర్తి కూడా కానున్నారు.
రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన మొదటి తెలుగు వ్యక్తి
సీజేఐగా మొదటి తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు (1966 జూలై 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు) 285 రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తరువాత రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వి రమణ సీజేఐ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలి నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము చేత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన మొదటి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. సిజెఐగా కోకా సుబ్బారావుకే అప్పటి రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం లభించింది. అయితే ఆయన సీజేఐగా రాజీనామా చేసి, రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఆయన అవకాశాన్ని కోల్పోయారు. అయితే ఆ ఎన్నికల్లో కోకా సుబ్బారావు, జాకీర్ హుస్సేన్ చేతులో ఓటమి చెందారు.
చారిత్రాత్మక తీర్పులేవీ లేవు
అయితే జస్టిస్ ఎన్వి రమణ పాలన కాలంలో చరిత్రను సృష్టించే కీలక తీర్పులేమీ ఇవ్వలేదు. ఆయన వివిధ సందర్భాల్లో చాలా ప్రసంగాలు చేశారు. కానీ జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఎటువంటి అంశాలపై కూడా చర్యలు తీసుకోలేదు. తన పదవీ కాలంలో చట్టం, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఏమి చేయాలో 29 ఉపన్యాసాలు ఇచ్చారు. అయినప్పటికీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆరు కేసులు, 'రాజ్యాంగ ధర్మాసనం విస్తృత సమీక్ష అవసరమయ్యే 53 కేసులపై ఎటువంటి పురోగతి లేదు. అవన్నీ మునుపటి ప్రధాన న్యాయమూర్తుల వలె పెండింగ్‌లో ఉంచబడ్డాయి. 1. ఆర్టికల్ 370 రద్దు 1,115 రోజులు పాటు పెండింగ్‌లో ఉంది. 2. ఎలక్టోరల్ బాండ్లకు సవాలు 1,816 రోజులు పెండింగ్‌లో ఉంది. 3. యుఎపిఎ రాజ్యాంగబద్ధతకు సవాలు 1,105 రోజులు పెండింగ్‌లో ఉంది. 4. ఆర్థిక ప్రమాణాల ఆధారంగా రిజర్వేషన్ 1,323 రోజులు పెండింగ్‌లో ఉంది. 5. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) 987 రోజులు పెండింగ్‌లో ఉంది. 6. హిజాబ్ కేసు 159 రోజులు పెండింగ్‌లో ఉంది. కానీ వాటి విచారణను పూర్తి చేయలేదు. లఖింపూర్ ఖేరీ కేసు పెండింగ్‌లోనే ఉంది. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు జోక్యంతోనే కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేశారు. జర్నలిస్టు సిద్ధిఖి కప్పన్ బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్‌లోనే ఉంది.
అదానీ కేసుకు రాజ్యాంగ ధర్మాసనం పని చేసింది
జస్టిస్ ఎన్వి రమణ కాలంలో సుప్రీం కోర్టు ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని ఇంప్లీడ్ కేసులలో ఉపయోగించలేదు. కేసులు విచారణ కోసం జాబితా చేయబడనప్పుడు, ప్రధాన న్యాయమూర్తి రోస్టర్‌కు మాస్టర్ కాబట్టి బాధ్యత అతనిపై ఉంటుంది. ఇటీవల, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పెగాసస్ ఆరోపణలను విచారిస్తున్న టెక్నికల్ కమిటీ సమర్పించిన తుది నివేదికను విచారణకు, పరిగణనలోకి తీసుకోవడానికి పెగాసస్ కేసును జాబితా చేయలేదు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో ఉన్న రాజ్యాంగ ధర్మాసనాల ముందు 53 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కీలకమైన ఆర్టికల్ 370 రద్దు వంటి కేసులు కూడా ఉన్నాయి. అయితే వాటిని విచారించే రాజ్యాంగం ధర్మాసనం పని చేయలేదు. కానీ జస్టిస్ ఎన్వి రమణ ఆధ్వర్యంలో అదానీ పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన కేసు విచారణకు సెప్టెంబరు 2021లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పనిచేసింది.
ఇతర సమస్యల పరిష్కారంలో కూడా విఫలం
సీజేఐ ఎన్వి రమణ కొనసాగించడంలో విఫలమైన ఉన్నత న్యాయ వ్యవస్థకు సంబంధించి సంస్కరణలు, న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం వ్యవస్థలో పారదర్శకత వంటి దీర్ఘకాల డిమాండ్లు ఉన్నాయి. కేసులను జాబితా చేసే మరింత పారదర్శక వ్యవస్థ వంటివాటిపై తనదైన ముద్ర వేయలేకపోయారు. కోర్టుల విచారణల ప్రత్యక్ష ప్రసారం, న్యాయమూర్తుల ఎంపిక కోసం ప్రమాణాలను నిర్ణయించడం వంటి సమస్యలు కూడా అలానే మిగిలిపోయాయి. రాజ్యాంగ ఆదేశమైన సామాజిక న్యాయాన్ని నెరవేర్చలేకపోయామని పేర్కొన్నారు. అయితే ఆయన పదవి కాలం ముగిసింది. ఈ రాజ్యాంగ ఆదేశాన్ని నెరవేర్చేందుకు సీజేఐ జస్టిస్ రమణ ప్రయత్నించారా అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.