Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30శాతం ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులు
- ఏడీఆర్ రిపోర్టు స్పష్టం
న్యూఢిల్లీ : తెలంగాణలోని ఎమ్మెల్సీల్లో 88శాతంమంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) పేర్కొంది. ఈ మేరకు ఏడీఆర్ బుధవారం నివేదికను విడుదల చేసింది. రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఇందులో 33 మందికి సంబంధించిన ఆర్ధిక, నేర, ఇతర అంశాలపై ఏడీఆర్ విశ్లేషించింది. అత్యధిక ఆస్తులు కలిగిన వారిలో తొలి మూడు స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలే ఉన్నారని తెలిపింది. రూ.126 కోట్ల ఆస్తులతో ఎగ్గె మల్లేశం తొలి స్థానంలో ఉండగా, రూ.74కోట్ల ఆస్తులతో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రూ.50కోట్లతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారని తెలిపింది. ఇక అత్యధిక అప్పులు చూపించిన వారిలో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి రూ.36కోట్లతో ముందువరుసలో ఉండగా, మరో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.39కోట్ల ఆస్తులను కలిగి ఉండగా, రూ.21కోట్ల అప్పులను కలిగిఉన్నట్టు నివేదిక తెలిపింది. ఇక అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన వారిలో మీర్జా రియాజుల్ హసన్ (ఎంఐఎం)కు రూ.61లక్షలు, వి.గంగాధర్‌గౌడ్ రూ.70లక్షలు, వి.యాదవరెడ్డి రూ.74లక్షలు కలిగి ఉన్నారని వెల్లడించింది. ఇక 33మందిలో 10మంది (30శాతం)పై క్రిమినల్ కేసులు ఉండగా, ఇందులో ఆరుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్టు తెలిపింది. వీరంతా టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని పేర్కొంది. ఇక మొత్తం ఎమ్మెల్సీల్లో 29మంది గ్రాడ్యుయేట్, ఆపై చదువులు చదివిన వారుండగా, మిగతా నలుగురు ఇంటర్ వరకు చదివిన వారని వెల్లడించింది.