Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక హక్కులను హరించొద్దు...కుదించొద్దు..!
- తిరుపతిలో కార్మికసంఘాల నిరసన హోరు
- పి.మధు, గఫూర్, రవీంద్రనాథ్, ప్రసాద్‌రావు సహా 300 మంది అరెస్టు
- స్టేషన్లలో, ఇండ్లలో కొనసాగుతున్న నిర్బంధకాండ
- నేడు ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు నేతల పిలుపు
తిరుపతి: 'కార్మిక హక్కులను హరించొద్దు... కుదించొద్దు..' అంటూ జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలతో తిరుపతి హోరెత్తింది.. 'కార్మికశాఖా మాత్యులు గో బ్యాక్' అంటూ నినదించారు.. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధకాండ ప్రయోగించి నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి సుదూర ప్రాంతాల్లోని కల్యాణమండపాలకు, స్టేషన్లకు తరలించారు. సాయంత్రం ఆరు గంటలకు సొంతపూచీకత్తుపై విడుదల చేసి ఇండ్లవద్ద సైతం గృహనిర్బంధకాండ కొనసాగించారు. సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్, ఏపీ రాష్ట్ర నాయకులు పి.మధు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఐఎఫ్టీయూ (ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌రావు, జిల్లా కార్యదర్శి ఆర్.హరిక్రిష్ణ, ఏఐటీయూసీ (ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శి కె.రాధాక్రిష్ణ సహా 300మందిని అరెస్టు చేశారు. రామచం ద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని కల్యాణమండపంలో ఉంచారు. ఏఐటీయూసీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ అత్యవసర సమావేశానికి హాజరుకావాలని చెప్పడంతో తిరుపతిలో రైలు ఎక్కించి శ్రీకాళహస్తి వరకూ ఎస్కార్ట్‌ను పెట్టి పంపించడం గమనార్హం. అరెస్టులను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఏపీ రాష్ట్ర నేతలు ఎంఎ గఫూర్, రవీంద్రనాథ్, ప్రసాద్‌రావులు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించేం దుకు రాష్ట్రాల కార్మిక శాఖా మంత్రుల సమావేశం నిర్వహి స్తుంటే ఆ సదస్సుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వడం దారుణమని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు తాము ప్రయత్నిస్తుంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుని గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను అమానుషంగా అరెస్టు చేయడం తీవ్రమైనది గా పరిగణిస్తున్నామని అరెస్టులను ఖండిం చారు. బుధవారం సాయంత్రం నుంచి పోలీసులు కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసేందుకు తీవ్రమైన ప్రయత్నం చేశారు.ఏపీలోని సీఐటీయూ, ఐఎఫ్టీయూ నేతలు రహస్య ప్రదేశాలకు వెళ్లిపోవడంతో పోలీసులు నేతల ఆచూకీ కనుక్కోవడం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేయడంతో ఏం జరుగుతుందో తెలియక పోలీసులు తికమక పడ్డారు. గురువారం నాటి ఉదయం ఏఐటీయూసీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ సహా కార్యకర్తలను బైరాగి పట్టెడలోని వారి కార్యాలయంలో పోలీసులు అరెస్టు చేశారు. నేతలు కార్యకర్తలు పోలీసులను ఛేదించుకొని ప్రదర్శన చేయడానికి ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి రామచంద్రపురం లోని ఓ ప్రయి వేటు కల్యాణ మండపం వద్దకు తరలించారు. అనంతరం సిఐటియు, ఐఎఫ్టీయూ నేతలు కలిసి అజ్ఞాతం నుంచి పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం నుంచి భారీ ప్రదర్శన చేయనున్నట్టు ప్రకటించారు. మాజీ ఎంపీ పెనుమల్లి మధు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో పదిన్నర గంటలకు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. 10.35కు అన్ని వైపుల నుంచి కార్యకర్తలు ఎర్రజెండాలతో బ్యానర్లతో పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రదర్శన గాంధీ రోడ్డు వైపు ప్రారంభమైంది. గాంధీ రోడ్డు నుంచి ప్రదర్శన ప్రారంభమైన ఐదు, పది నిమిషాల లోపే పోలీసులు ప్రదర్శన వద్దకు చేరుకున్నారు. ప్రదర్శన కారులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పెద్ద ఎత్తున పెనుగులాట జరిగింది.
పోలీసులు పెనుమల్లి మధును బలవంతంగా తీసుకువెళ్లి జీపులో వెస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ ను అరెస్టు చేసే క్రమంలో తోపులాటలో ఆయన కింద పడిపోయారు. దీంతో కార్యకర్తలు తిరగబడి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. అనంతరం పోలీసులు అరెస్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినా గఫూర్, నేతలు అంగీకరించకపోవడంతో బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. నాయకులను బలవంతంగా ఈడ్చుకుంటూ, దౌర్జన్యంగా లాక్కు వెళ్లి పోలీస్ జీపులను, వ్యాన్లను ఎక్కించారు. అనంతరం ఐఎఫ్టీయూ(ఏపీ) ఆధ్వర్యంలో ప్రదర్శన ఆంజనేయస్వామి గుడి నుంచి ఘటన జరుగుతున్న ప్రాంతానికి రావడంతో ఐఎఫ్టీయూ(ఏపీ) రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ ను వారి నేతలను బలవంతంగా అరెస్టు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వారిని అరెస్టు చేయడం పోలీసులకు తల నొప్పిగా మారింది. వీరందరినీ తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలోని రామచంద్రాపురం మండల పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కల్యాణ మండపంలో నిర్బంధంలో ఉంచారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు టి. సుబ్రహ్మణ్యం, జయ చంద్ర, పి.సాయిలక్ష్మి ఆర్. లక్ష్మీ, జి.బాలసుబ్రమణ్యం, జయంతి, వేణు, మురళి, బుజ్జి,, రవి, ఉరుకుంద్, యుగంధర్, రామ్మూర్తి లతో పాటు ఐఎఫ్టియు నేతలు హరికష్ణ, వెంకటరత్నం, విజయకుమార్, గంగాభవాని తదితరులు అరెస్టయ్యారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్కోడ్లపై పునరాలోచన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ కమిటి ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాజారెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సమస్యపై కేంద్ర కార్మిక శాఖా మంత్రి భూపేంద్రయాదవ్‌కు వినతిపత్రం ఇస్తామని ఎస్పీని కోరగా ఆయన నిరాకరించడంతో స్టేషన్ ఎదుటే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి పోరాడి కార్మికులు సాధించుకున్న హక్కులను హరించడం హేయమైన చర్యన్నారు. వెంటనే పునరాలోచన చేయాలని కోరారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ పథకాలను మార్చడం వల్ల కార్మికులు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆ సంఘం నాయకులు షేక్ మహ్మద్‌రఫి, తిరుమలరెడ్డి, యశోద పాల్గొన్నారు.