Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు ఫోన్లలో కొన్ని మాల్వేర్లు ఉన్నాయి
- నిపుణులు కమిటీ నివేదికను బహిరంగ పరిచిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని సుప్రీం కోర్టు పేర్కొకంది. ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికను పరిశీలించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వి రమణ , న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ''టెక్నికల్ కమిటీకి 29 ఫోన్లు ఇచ్చారు. అందులో 5 ఫోన్లలో కొన్ని మాల్వేర్లు కనిపించాయి. అయితే టెక్నికల్ కమిటీ మాత్రం అది పెగాసస్ అని చెప్పలేమని చెబుతోంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే కమిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని సాంకేతిక కమిటీ చెప్పిందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టు వెబ్సైట్లో వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు లేని నివేదికను అప్లోడ్ చేయవచ్చని పేర్కొంటూ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో పరిశీలిస్తామని ధర్మాసనం సూచించింది. కమిటీ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని తెలిపిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తనకు ఈ విషయం తెలియదని తుషార్ మెహతా బదులిచ్చారు. కమిటీ నివేదికలో నిఘా, గోప్యత హక్కును మెరుగుపరచడం, దేశం సైబర్ భద్రతను పెంపొందించడం, పౌరుల గోప్యత హక్కును బలోపేతం చేయడం, చట్టవిరుద్ధమైన నిఘాపై ఫిర్యాదులను లేవనెత్తడానికి ఒక యంత్రాంగాన్ని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే, కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.పిటిషనర్లలో ఒకరి తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఎలాంటి మాల్వేర్ దొరికిందో తెలుసుకునే హక్కు వారికి ఉందన్నారు. అందుకే నివేదిక కాపీని తమకు కోరారు. న్యాయవాది వ్రిందా గ్రోవర్ కూడా ఇలానే కోరారు. ''ఇక్కడ నా పరికరాన్ని కూడా పరిశీలించారు. ఫోరెన్సికల్‌గా పరిశీలించినందున మాల్వేర్ ఏమిటో మేం తెలుసుకోవాలి. నా క్లయింట్ కూడా నేరారోపణలను ఎదుర్కొంటున్నారు'' అని గ్రోవర్ చెప్పారు. దేశంలో జర్నలిస్టులు, కార్యకర్తలు, న్యాయవాదులు, అధికారులు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ఇతరులతో సహా అనేక మంది వ్యక్తులను నిఘా చేయడానికి ఇజ్రాయెల్ కంపెనీ రూపొందించిన పెగాసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై సుప్రీం కోర్టులో సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ , హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ డైరెక్టర్ ఎన్ రామ్ , న్యాయవాది ఎంఎల్ శర్మ, ఏషియానెట్ వ్యవస్థాపకుడు శశికుమార్ , ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా , జర్నలిస్టులు రూపేష్ కుమార్ సింగ్, ఇప్సా శతాక్షి , పరంజోరు గుహా ఠాకుర్తా , ఎస్ఎన్ఎం ఆబిది, ప్రేమ్ శంకర్ ఝా పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం ధర్మాసనం దీనిపై విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీ ఈ ఏడాది జులైలో తన నివేదికను కోర్టుకు సమర్పించింది. కమిటీలో అలోక్ జోషి (మాజీ ఐపీఎస్ అధికారి), డాక్టర్ సందీప్ ఒబెరారు (సబ్ కమిటీ చైర్మెన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్, ఇంటర్నేషనల్ ఎలక్ట్రో-టెక్నికల్ కమిషన్, జాయింట్ టెక్నికల్ కమిటీ) కూడా ఉన్నారు.
తీస్తా సెతల్వాద్ బెయిట్ పిటిషన్ వాయిదా
ఆగస్టు 30న తదుపరి విచారణ
జైలు శిక్ష అవసరమా? కాదా? పరిశీలిస్త్ణాం జస్టిస్ యుయు లలిత్
గుజరాత్ అల్లర్ల కుట్ర కేసులో ఉన్నత స్థాయి అధికారులను ఇరికించేందుకు రికార్డులను తారుమారు చేశారంటూ గుజరాత్ ఏటీఎస్ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ తీస్తా సెతల్వాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ యుయు లలిత్, రవీంద్ర భట్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ''పిటిషన్‌పై తమ సమాధానం సిద్ధంగా ఉంది. అయితే దానితో నేను సంతోషంగా లేను. ఆ సమాధానానికి కొన్ని దిద్దుబాట్లు అవసరం. పూర్తి చేసి వచ్చే సోమవారం మీకు అందజేస్తా'' అని పేర్కొన్నారు.
''అయితే పిటిషనర్ జైళ్లో ఉన్నారు. కనుక మీరు దానిని ఫైల్ చేసి, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఇవ్వండి'' అని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ప్రత్యేకంగా ఏమీ లేదని ఎస్జి పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ కేసులో పిటిషనర్ నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉన్నారని, ప్రత్యేకంగా ఏమీ లేదని తెలిపింది. దీనికి జైలు శిక్ష అవసరమా? కాదా? అని కూడా పరీక్షిస్తున్నామని జస్టిస్ యుయు లలిత్ పేర్కొన్నారు. తదుపరి విచారణను వచ్చే మంగళవారం (ఆగస్టు 30)కి వాయిదా వేసింది.