Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్కిస్ బానో కేసులో 11 మంది జీవిత ఖైదీలకు విముక్తిపై....
- గుజరాత్ ప్రభుత్వానికి, సుప్రీం కోర్టు నోటీసులు
- సమాధానం దాఖలు చేయండి: సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో 11 మంది జీవిత ఖైదీలకు ఉపశమనం కల్పించడంపై గుజరాత్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడి చేసి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మంది దోషులకు ఉపశమనం కల్పిం చాలన్న రాష్ట్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం గుజరాత్ ప్రభుత్వాన్ని స్పందన కోరింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ అజరు రస్తోగి , జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం
రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం దాఖలు చేయాలనీ, 11 మంది దోషులను కూడా ఇందులో ఇంప్లీడ్ చేయాలని ఆదేశించింది. బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడికి పాల్పడి.. ఆమె కుటుంబానికి చెందిన 14 మందిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదీ పడిన జస్వంత్ నారు, గోవింద్ నారు, శైలేష్ భట్, రాధేశం షా, బిపిన్ చంద్ర జోషి, కేసర్భారు వోహానియా, ప్రదీప్ మోర్ధియా, బకాభారు వోహానియా, రాజుభారు సోనీ, మితేష్ భట్, రమేష్ చందనా అనే 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. దీంతో వారు ఈ ఆగస్టు 15 రోజున విడుదల అయ్యారు. గుజరాత్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ సీపీఐ(ఎం) మాజీ ఎంపీ, పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిశ్రీణి అలీ, స్వతంత్ర పాత్రికేయురాలు, సినీ నిర్మాత రేవతి లాల్, మాజీ ఫిలాసఫీ ప్రొఫెసర్ రూప్రేఖ్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం గురువారం విచారించింది.
విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గుజరాత్ నిబంధనల ప్రకారం దోషులు ఉపశమనం పొందేందుకు అర్హులా? కాదా? అని ప్రశ్నించింది. ఉపశమనాన్ని మంజూరు చేసేటప్పుడు ఈ కేసులో విచిక్షణను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనేది పరిగణించాల్సి ఉందని పేర్కొంది. ''ఉపశమనం మంజూరు చేసేటప్పుడు ఈ కేసులో విచక్షణ ఉపయోగించారా? లేదా? అనేది మనం చూడాలి. ఉపశమనం మంజూరు చేయలేదని మీరు చెబుతున్నారా?'' అని ధర్మాసనం ప్రశ్నించింది.
''మేం విచక్షణ ఉన్నదో లేదో మాత్రమే చూడాలనుకుంటున్నాం'' అని పిటిషనర్ న్యాయవాది సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ బదులిచ్చారు. ''దయచేసి పిటిషన్ చూడండి. మతపరమైన అల్లర్లలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దాహౌద్ జిల్లాలోని లిమ్ఖేడా గ్రామంలో కూడా కాల్పులు, దోపిడీలు, హింస జరిగింది. బానో, షామిన్లు ఇతరులతో కలిసి తప్పించుకున్నారు. షమీమ్ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 25 మంది గ్రూప్ ప్రాసిక్యూట్రిక్స్, ఇతరులు తప్పించుకోవడాన్ని చూశారు. వారు ముస్లింలను కొట్టండి అంటున్నారు. మూడేండ్ల చిన్నారి తల నేలపై పగలగొట్టారు. గర్భిణీపై లైంగికదాడికి పాల్పడ్డారు '' అని సిబల్ వివరించారు. మరోవైపు గుజరాత్ రాష్ట్రం తరపు న్యాయవాది ఈ పిటిషన్ వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వం తన సమాధాన్ని దాఖలు చేయాలని కోరింది. తదుపరి విచారణకు రెండు వారాల తరువాత ఈ అంశాన్ని జాబితా చేయనుంది.