Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఎదుర్కోవటంపై సీతారాం ఏచూరి
- 'ఫాసిస్టు హిందుత్వ' కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన
అగర్తల : కేంద్రంలోని అధికార బీజేపీని ఎదుర్కోవటానికి లౌకిక శక్తుల పెద్ద వేదిక అవసరమున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కటం ద్వారా దేశంలో 'ఫాసిస్టు హిందూత్వ' కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని త్రిపురలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన చెప్పారు. భారత ప్రజాస్వామ్యానికి నాలుగు ప్రధాన స్తంభాలు అయిన లౌకికవాదం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, సమాఖ్యవాదం ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సక్రమంగా పనిచేయని కారణంగా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదన్నారు. బీజేపీని అధికారం నుంచి పెకిలించకపోతే రాజ్యాంగాన్ని రక్షించలేమని ఏచూరీ తెలిపారు. సీపీఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీల బలాన్ని ఏకీకృతం చేయటంతో పాటు దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవటానికి అన్ని లౌకిక శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరమున్నదన్నారు. ఎన్నికల్లో గెలుపోటములతో సంబంధంలో లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నదన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగటం లేదని చెప్పారు. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వ సిఫారసు మేరకు బిల్కిస్ బానో దోషులు విడుదలయ్యారని ఏచూరీ ఆరోపించారు. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించటం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి కూడా పాల్గొని మాట్లాడారు.