Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లెపై ధరల భారం
పచ్చటి పల్లెలు పస్తులుంటున్నాయి. గ్రామీణ జనానికి పని లేదు.బువ్వ దొరకటం కష్టమవుతోంది. అకాలవర్షాలతో పంటలన్నీ నీటమునిగాయి. దీంతో అన్నదాత దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. ఉపాధిహామీ పనులకు కేంద్రం కోత పెట్టింది. నిధులివ్వటంలేదు. దీంతో పల్లెజనం ధరలభారం తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు.
- గ్రామీణ భారతంలో అధిక ద్రవ్యోల్బణం
- పట్టణాల్లో కంటే ఎక్కువగానే..!
- ఆకాశానికి ఆహార ధరలు : ఆర్థిక నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాలు చూపెడుతున్నాయి. దేశంలో అధిక ద్రవ్యోల్బణం ఇబ్బందులకు గురి చేస్తున్నది. ధరల భారం సామాన్యులపై పడుతున్నది. ముఖ్యంగా, పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నది. ఫలితంగా ఆహార ధరలు ఆకాశానికి చేరాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ విషయంలో ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ భారతంలో ద్రవ్యోల్బణం రేట్లు అధికంగా ఉన్నాయి. జులై నెలలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.49గా నమోదైంది. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ)లో గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం, పానీయాల రంగం వాటా 54.18 శాతంగా ఉన్నది. అదే రంగం పట్టణ ప్రాంతాలలో 36.29 శాతంగా ఉన్నది. అయితే, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్నారు. ఆహార ధరలలో మార్పులను కొలిచే వినియోగదారుల ఆహార ధరల సూచిక (సీఎఫ్‌పీఐ) గ్రామీణ ప్రాంతాల్లో 6.80 శాతంగా ఉన్నది. ఇది 11 బేసిస్ పాయింట్ల వ్యత్యాసంతో పట్టణ ప్రాంతాల్లో 6.69 శాతంగా ఉండటం గమనార్హం. భారత్‌లో 2020 నుంచి ద్రవ్యోల్బణం రేటు అత్యధికంగా ఉన్నది. పల్లెల్లో వంట నూనెల ధరలు 20.75 శాతంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో అది 15.15 శాతంగానే నమోదు కావటం గమనార్హం.గత మూడు-నాలుగేండ్లుగా గ్రామీణ ద్రవ్యోల్బణం.. పట్టణ ప్రాంతాల కంటే తక్కువగానే ఉన్నట్టు గణాం కాలు చూపినప్పటికీ అవి నిజం కావని ఆర్థిక నిపుణులు చెప్పారు. ఇందుకు 2020 డిసెంబర్లో ఆర్బీఐ ప్రచురించిన బులెటిన్‌ను వారు ఉటంకించారు. గ్రామీణ భారత్‌లో సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేట్లలో పెరుగుదల సాధారణంగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి 2017-18 వరకు పట్టణాల్లో కంటే ఎక్కువగా ఉన్నదన్నారు. ఆ తర్వాత 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి పట్టణ ద్రవ్యోల్బణ రేటు వేగంగా పెరగటం ప్రారంభమైందని చెప్పారు. గత ఆరునెలలుగా ధరలు 4-6 శాతం కంటే ఎక్కువగా ఉండటం, ఆహార ఉత్పత్తిపై అనిశ్చితి ఉన్న సమయంలో గ్రామీణ ద్రవ్యోల్బణం పెరగటం మంచి సంకేతం కాదని నిపుణులు తెలిపారు. దీనిపై కేంద్రం దృష్టిని సారించి ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.పోతే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని హెచ్చరించారు.