Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశానికి కార్మిక సంఘాలను దూరంగా ఉంచారు : సీఐటీయూ విమర్శ
న్యూఢిల్లీ : తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్మిక సదస్సు ఒక బూటకమని, ఈ సమావేశానికి కార్మిక సంఘాలను దూరంగా ఉంచారని సీఐటీయూ విమర్శించింది. 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాల వైఫల్యాలపై మభ్యపెట్టడానికే ఈ సదస్సును నిర్వహించిందని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో జాతీయ కార్మిక సదస్సు పేరుతో, పెద్ద ఎత్తున మీడియా ప్రచారంతో జరిగిన మంత్రుల-అధికారుల సమావేశం ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, గందరగోళం చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా సీఐటీయూ విమర్శించింది. కేంద్రం, రాష్ట్రాల కార్మిక మంత్రులు అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశాన్ని జాతీయ కార్మిక సమావేశంగా పిలవలేమని, ఈ సమావేశానికి కార్మికులను, కార్మిక సంఘాలను దూరంగా ఉంచారని సీఐటీయూ విమర్శించింది. ప్రతి ఏడాదీ నిర్వహించాల్సిన భారత కార్మిక సదస్సును గత ఏడేండ్ల నుంచి, 2015 నుంచి నిర్వహించడం లేదనీ, వాస్తవాలను మరుగున పర్చి ప్రజల్ని మభ్యపెట్టడానికే తిరుపతిలో సదస్సు నిర్వహించారని సీఐటీయూ తెలిపింది.
ప్రభుత్వంలో అత్యున్నత వ్యక్తి తన తప్పుడు ప్రకటనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని, జాతి సంపద ఉత్పత్తి చేస్తున్న కార్మికుల హక్కులు, పరిస్థితిపై తప్పుడు ప్రకటనలకే ఈ సమావేశం ఉద్దేశించబడిందని సీఐటీయూ పేర్కొంది. కార్మికులపై బానిసత్వ షరతులను విధించడానికే ఈ సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించిందని సీఐటీయూ విమర్శించింది. బానిసత్వ కాలం నుంచి ఉన్న చట్టాలను రద్దు చేసినట్టు ఈ సమావేశం ప్రారంభ ప్రసంగంలో చెప్పినా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని, పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా ఈ క్రూరమైన లేబర్ కోడ్లను అమలులోకి తెచ్చారని సిఐటియు విమర్శించింది. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాల్లోని అనేక కార్మిక హక్కులు, నిబంధనలను తగ్గించివేశారని గుర్తు చేసింది. పార్లమెంట్ ద్వారా మొత్తం ప్రజాస్వామ్య శాసన ప్రక్రియను పూర్తిగా తుంగలోకి తొక్కి నాలుగు కార్మిక కోడ్లను ప్రభుత్వం ఆమోదింప చేసిందని విమర్శించింది. ప్రయివేట్ కార్పొరేట్లకు, భారీ వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనం, అధికారం కల్పించడానికే ఈ కొత్త చట్టాలను తెచ్చారని పేర్కొంది. ఈ క్రూరమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఏకగ్రీవంగా డిమాండ్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, శ్రామిక ప్రజలపై బానిసత్వాన్ని విధించే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాన్ని కొనసాగిస్తామని సీఐటీయూ స్పష్టం చేసింది.