Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ వల్లే పార్టీ ఇలా అయ్యింది...
- సోనియాగాంధీకి గులాంనబీ ఆజాద్ లేఖ
న్యూఢిల్లీ : ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన గులాంనబీ ఆజాద్..చివరికి ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలికి లేఖ రాసిన ఆయన..తాను పార్టీని వీడటానికి రాహుల్‌గాంధీ తీరు ఓ కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్నప్పటికీ..రాహుల్‌గాంధీ అనుచరులే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు. లేఖలో రాహుల్‌గాంధీ తీరును ఆజాద్ ప్రధానంగా ప్రస్తావించారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితు లైనప్పటి నుంచి పార్టీని ఆయన నడిపిన తీరుపై ఆజాద్ విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలను పక్కనబెట్టి..కేవలం పీఏలు, సెక్యూరిటీ గార్డులు, కోటరీల సలహాలతోనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకునేవారని మండిపడ్డారు. వారితోనే పార్టీని నడపడం మొదలుపెట్టారని..తద్వారా పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిందని రాహుల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇక పార్టీలో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమే నని..రిమోట్ కంట్రోల్ మోడల్లో పార్టీ వ్యవహరాలు నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో మార్పులను సూచించేందుకు గతంలో నిర్వహించిన మేధోమథనంలోని అంశాలు అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని కనీసం పరిశీలించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.కష్ట సమయంలో కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్టీని ప్రక్షాలన చేయాలని 'చింతన్ శిబిర్'లో తీర్మానం చేసినా ఫలితాలు మాత్రం కనబడటం లేదు. సీనియర్ల అనూహ్య నిర్ణయాలు..కాంగ్రెస్ అధిష్టానానికి దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మరోవైపు ఈఏడాది చివర్లో, వచ్చే ఏడాది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార బాధ్యతల్ని ఆనంద్ శర్మ తిరస్కరించటం తీవ్ర కలకలం రేపింది. పార్టీలో కీలక పదవి నుంచి తనను తొలగించటం, తనకు అత్యంత సన్నిహితుడైన గులాం అహ్మద్ మిర్‌ను జమ్మూకాశ్మీర్ పీసీసీ పదవి నుంచి తొలగించటం ఆజాద్ అసంతృప్తి కారణమని సమాచారం.