Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు కమిటీకి సహకరించకపోవటం ఆమోదయోగ్యం కాదు
- పెగాసస్‌పై మోడీ సర్కారు తీరును ఖండించిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్‌ను భారత పౌరుల మీద ఉపయోగించటంపై న్యాయవ్యవస్థ, దేశం ముందు జవాబుదారీగా ఉండటానికి కేంద్రం నిరాకరించటాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ స్పైవేర్ వినియోగంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.. ప్రభుత్వం 'సహకరించలేదు' అని తెలియజేసింది. ఇది ఆమోదయోగ్యం కాదు. పౌరుల ప్రాథమిక హక్కులు, ప్రత్యేకించి గోప్యత హక్కు విచక్షణారహితంగా ఉల్లంఘించరాదని ఇది ''జాతీయ భద్రత''కు సంబంధించినదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అంగీకరించకపోవటమనేది.. ఈ స్పైవేర్ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు మొదలైనవారిపై దుర్వినియోగం చేసిందనీ, ఇది ప్రజాస్వామ్య నాణ్యత, పౌరుల ప్రజాస్వామ్య హక్కులపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందన్నది స్పష్టం. పెగాసస్ వాడకంపై ఆరోపణలు వచ్చినప్పుడు చాలా దేశాలు తీవ్రమైన పరిశోధనలు ప్రారంభించాయి. ఫ్రాన్స్, మెక్సికో, స్పెయిన్, ఇతర దేశాలు వీటిని తీవ్రంగా కొనసాగిస్తున్నాయి. భారత్, హంగేరీ, సౌదీ అరేబియా వంటి దేశాల ప్రభుత్వాలు ఈ స్పైవేర్‌ను తీసుకొచ్చినట్టు ఇజ్రాయిల్ పరిశోధనల్లో వెల్లడైంది. దీన్ని బట్టి కేంద్రం స్వచ్ఛంగా, జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. న్యాయవ్యవస్థ అలాంటి జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి.