Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించే చర్యల్లో ఆ పార్టీ నిమగం
- ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేల కొనుగోలు: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీని సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవచ్చని ఆ పార్టీ భయపడుతున్నదని అన్నారు. ఈ కారణంగానే ఇటీవల ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు జరిగాయని ఆరోపించారు. అందుకే తనపై రకరకాల కుట్రలు జరుగుతున్నాయని వివరించారు. '' బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చటానికి.. బీజేపీ ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించించింది. బీజేపీ సీరియల్ కిల్లర్‌లా తయారైంది. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలనే ప్రయత్నాల్లో ఆ పార్టీ నిమగమై ఉన్నది'' అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఆపరేషన్ కమలం వెనుక.. తాము ప్రస్తావించే వ్యతిరేకాంశాలే కారణమని తెలిపారు. దీనితో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోతున్నాయన్నారు. ఇలాంటి అరాచక శక్తులు.. స్వార్థం, అధికారం కోసం తెగబడుతున్నాయని కేజ్రీవాల్ చెప్పారు.
గిట్టనివాళ్లు మాతో ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. '' మనీష్ సిసోడియాపై తప్పుడు ఆరోపణలు చేశారు. మనీష్‌ను కుట్ర కింద ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నది. ఢిల్లీలో ఎలాంటి కుంభకోణమూ జరగలేదు. సీబీఐ గంటల తరబడి వెతికినా మనీష్ సిసోడియా ఇంటి నుంచి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మనీష్ సిసోడియాకు సీఎం పదవిని ఆఫర్ చేశారు. 40 మంది ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారు. మనీష్ సిసోడియా విద్యారంగంలో సంస్కరణలు చేసినందున ఇది జరిగింది. ప్రజలు తమ రక్తాన్ని, చెమటతో సంపాదించిన కష్టార్జితాన్ని జీఎస్టీ, పెట్రో పన్నుల రూపంలో వసూలు చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికీ, ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ ఉపయోగిస్తున్నది. ఇది ఎలాంటి రాజకీయం? ఇదేనా అభివద్ధి రాజకీయం? మనతో పాటు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రత్యర్థులకు తెలిసేలా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తీసుకురావాలనుకుంటున్నాను'' అని కేజ్రీవాల్ అన్నారు. మరి ఆయన వెంట ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వలలో చిక్కుతున్నారన్నదే సస్పెన్స్.