Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌కు తగ్గుతున్న బియ్యం, గోధుమ కేటాయింపులు
- 2014లో ఆహార ధాన్యాల కేటాయింపు 6.14 కోట్ల టన్నులు
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.05 కోట్ల టన్నులు..
న్యూఢిల్లీ : బియ్యం, పప్పు, వంటనూనెలు..ఇలా అన్నింటి ధరలు ఇప్పటికే పెరిగాయి. ఆహార పదార్థాల్ని కొనుగోలు చేయడానికి పేదలు, మధ్య తరగతి బెంబేలెత్తిపోతున్నారు. అలాంటిది నిత్యావసర సరుకుల ధరలన్నీ మళ్లీ పెరగటం మొదలైంది. ధరల పెరుగుదలకు పాలకులు అడ్డుకట్ట వేయకపోగా, సంక్షేమ పథకాల్ని సమర్థంగా అమలుజేయటం లేదు. గత కొన్నేండ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం నుంచి బియ్యం, గోధుమల కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. మరోవైపు దేశ జనాభా ప్రతిఏటా భారీగా పెరుగుతోంది. 2014-15లో బియ్యం, గోధుమ కేటాయింపులు 6.16 కోట్ల టన్నులుకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 6.05 కోట్ల టన్నులకు చేరుకుంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రారంభమైన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్న బియ్యం, గోధుమల పంపిణీ సెప్టెంబర్ నెలతో ఆగిపోనున్నది.
2016-17 నుండి ఆహారధాన్యాల కేటాయింపు క్షీణిస్తూ వస్తోంది. 2022-23కి 4.01కోట్ల టన్నుల బియ్యం, 2.04 కోట్ల టన్నుల గోధుమల్ని కేంద్రం కేటాయించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆహార ధాన్యాల కేటాయింపు జరుపుతోంది. దీనిని సవరించాలని సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని ఆదేశించింది. 2021కి సంబంధించి అధికారిక జనాభా అంచనాల ప్రకారం, ఆహార ధాన్యాల పంపిణీ ప్రస్తుతం 80 కోట్ల జనాభాకు కాకుండా 90 కోట్ల కంటే ఎక్కువమందికి అందించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆహార ధాన్యాల మొత్తం కేటాయింపు కేవలం 6.05లక్షల టన్నులు. ఇందులో నుంచి రేషన్ దుకాణాలకు, పిల్లల కోసం అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజనం పథకం కొత్త పేరు 'పీఎం పోషన్ పథకం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల హాస్టల్స్‌కు, కిశోర బాలికల పథకం, అన్నపూర్ణ పథకం..మొదలైనవాటికి ఆహారధాన్యాల్ని పంపుతోంది. రైతుల నుంచి ఆహార ధాన్యాల్ని కేంద్రం కొనుగోలు తగ్గటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ సేకరణ దెబ్బతినటం సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం చూపుతోందని తెలిపారు.