Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 5న పిటిషన్లపై విచారణ
- పదే పదే వాయిదాలు కోరుతున్న న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం
న్యూఢిల్లీ : హిజాబ్ వివాదంలో కర్నాటక ప్రభుత్వానికి, ఈ కేసుకు సంబంధించి ఇతర కక్షిదారులకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించరాదంటూ కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. దేశంలో అనేకచోట్ల మతచిచ్చు రేపింది. అయితే కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్నాటక హైకోర్టు సమర్ధించటం మరింత సంచలనం రేపింది. దీనిని సవాల్ చేస్తూ అనేకమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా..వీటిపై సెప్టెంబర్ 5న సుప్రీం విచారణ చేపట్టబోతోంది. ఈనేపథ్యంలో కర్నాటక ప్రభుత్వానికి, కొంతమంది పిటిషనర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. కర్నాటక తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
అయితే కేసు విచారణకు రాకుండా కొంతమంది పిటిషన్‌దారు తరఫు న్యాయవాదులు వాయిదాలమీద వాయిదాలు కోరుతున్నారని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్నాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సెప్టెంబర్ 5న విచారిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొనగా, ఈ విషయంతో సంబంధమున్న కొంతమంది పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ..''మరో రెండు వారాల గడువు ఇస్తే బాగుంటుంది'' అని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ..''కర్నాటక నుంచి ఢిల్లీకి రావడానికి విమానంలో రెండు గంటలు పడుతుంది. ఏదేమైనా..సోమవారమే విచారిస్తా''మని తేల్చి చెప్పింది. ఈ కేసుతో సంబంధమున్న మరికొంత మంది న్యాయవాదులు కూడా విచారణను రెండు వారాల తర్వాత చేపట్టాలని కోరారు. దీంతో ఆ న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను కేవలం వాయిదాలు వేయించటమే పనిగా పెట్టుకున్నారని, పదే పదే వాయిదా కోరుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిని ఎంతమాత్రమూ ఆమోదించమని తెలిపింది.