Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికార్, ఝున్‌ఝునులో అన్ని స్థానాలూ కైవసం
- రాజస్థాన్ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి విభాగం సత్తా
జైపూర్ : రాజస్థాన్ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ సత్తా చాటింది. సికార్, ఝున్‌ఝునులో అన్ని పోస్టులను గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. సికార్‌లో గల పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యారు షెకావతి యూనివర్సీటీలో వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ అన్ని పోస్టులను కైవసం చేసుకున్నది. విజేంద్ర ధకా 25 ఓట్ల తేడాతో అధ్యక్ష స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే, ఝున్ఝునులోని సేత్ నేత్రం మఫ్ురాజ్ టిబ్రెవాలా గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీ, శ్రీ రాధేశ్యామ్ ఆర్. మొరార్క ప్రభుత్వ పీజీ కాలేజీ లలోనూ ఎస్ఎఫ్ఐ అన్ని స్థానాలనూ గెలుపొందింది. రాజస్థాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ 19వ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఎన్ఎస్యూఐ రెబెల్ అభ్యర్థి నిహారికా జోర్వల్పై నిర్మల్ చౌదరీ 1400 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. నిర్మల్ చౌదరీకి 4,843 ఓట్లు వచ్చాయి. జోర్వాల్కు 2,578 ఓట్లు పోలయ్యాయి. ఎన్ఎస్యూఐ అభ్యర్థి రీతూ బరాల మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ కి చేదు ఫలితాలే ఎదురయ్యాయి. రాష్ట్రంలోని పది యూనివర్సిటీల్లో ఏ ఒక్క సంస్థలోనూ ఎన్ఎస్యూఐ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. బికనీర్‌లోని దుంగర్ కాలేజీ అధ్యక్ష స్థానాన్ని ఎన్ఎస్యూఐ అభ్యర్థి హరిరామ్ గోదర సొంతం చేసుకోగలిగారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ అభ్యర్థి నరేంద్ర యాదవ్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి అమీశా మీనా ఉపాధ్యక్ష స్థానానికి, ఎన్ఎస్యూఐ కి చెందిన ధరా కుమావత్ జాయింట్ సెక్రెటరీ గా విజయం సాధించారు. కరోనా కారణంగా దాదాపు రెండేండ్ల విరామమనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘం ఎన్నికలను నిర్వహించారు. దాదాపు 15 యూనివర్సీటీలు, 400 ప్రభుత్వ కాలేజీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నట్టు అంచనా.