Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోధుమల ఎగుమతులకు పచ్చజెండా
- భారీగా వ్యాపారం
- ఇతర వర్తకులకూ దెబ్బ
న్యూఢిల్లీ : వడ్డించే వాడు మనవాడు అయితే ఏ మూలన ఉన్నా ముట్టేది ముడుతుందన్న సామెత ముకేష్ అంబానీకి సరిగ్గా సరిపోతుంది. దేశంలో గోధుమల ధరలు భారీగా పెరుగుతున్నాయనే అంచనాల్లో ఈ ఏడాది ఆ గింజల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా.. ఈ పరిమితుల నుంచి ముకేష్ అంబానీని మినహాయిస్తూ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో అంబానీ గోధుమల ఎగుమతుల్లో రెండో స్థానంలోకి వచ్చారని ఆల్ జజీరా ఓ రిపోర్ట్‌లో తెలిపింది. గోధుమల ఎగుమతులపై నిషేధం ప్రకటించిన తర్వాత ముకేష్ అంబానీ తిండిగింజల ట్రేడింగ్‌లోకి రావడం విశేషం. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి ఇంతకుమించిన దృష్టాంతం ఏముంటుంది?
కేంద్ర ప్రభుత్వం 2022 మేలో గోధుమల ఎగుమతులపై ఆకస్మికంగా నిషేధం ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వాణిజ్య మంత్రిత్వ శాఖ అంబానీ కంపెనీకి అనుమతులు ఇవ్వడం గమనార్హం. వాస్తవానికి ఈ నిషేధం ముందు నాటికి ఈ వ్యాపారంలో ఉండి బ్యాంక్ గ్యారంటీ, అదే విధంగా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) కలిగిన వారు మాత్రమే గోదుమలను ఎగుమతి చేయడానికి వీలుంది. ఈ రెండు షరతులను సాధారణ ఎగుమతిదారులు చేరకపోవడంతో పరిశ్రమకు దూరంగా ఉండిపోయినట్టు ఆ రంగం వర్తకులు తెలిపారు. సాధారణ వ్యాపారాల్లో ఎల్సీలను కలిగిన ఐటీసీ లిమిటెడ్ సైతం ప్రభుత్వ షరతులతో భవిష్యత్తు ఎగుమతుల అనుమతుల్లో వెనుకబడి పోయిందన్నారు. మే 12న రిలయన్స్ రిటైల్‌కు 85 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.674 కోట్ల) ఎల్సీ లభించింది. దీంతో ఆ సంస్థ 2.50 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల కొనుగోలుకు కేంద్రం అవకాశం కల్పించింది. మే 13న మరికొంత మంది ట్రేడర్లు ఎగుమతుల ఎల్సీ కోసం దరఖాస్తు చేయగా.. వాణిజ్య మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. మే 13 లేదా అంతకు ముందు నాటి ఎల్సీలు కలిగిన కంపెనీలను మాత్రమే గోధుమలను రవాణా చేయడానికి అనుమతించింది. 21 లక్షల టన్నుల గోదుమలను మాత్రమే ఎగుమతులు చేయడానికి కేంద్రం అనుమతులు ఇవ్వగా.. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 16 నాటి వివరాల ప్రకారం.. అందులో రిలయన్స్ రిటైల్ సుమారు 3,34,000 మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేసి రెండో స్థానంలోకి వచ్చింది. ఐటీసీ 7,27,733 మెట్రిక్ టన్నుల ఎగుమతులతో తొలి స్థానంలో ఉంది. ట్రేడింగ్ ప్రారంభించిన అతికొద్ది రోజుల్లోనే రిలయన్స్ ఈ రంగంలో రెండో స్థానంలోకి రావడంతో పరిశ్రమ వర్గాలు తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళనలో పడ్డాయి. గతేడాది మధ్య నుంచి మాత్రమే వ్యవసాయ ఎగుమతుల్లోకి రావడానికి రిలయన్స్ సిద్దం అవుతోంది. ఇందుకోసం అబూదాబిలో రిలయన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పేరుతో ఓ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్టు 2021 అక్టోబర్‌లో స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. దీంతోనే చమురు ట్రేడింగ్, వ్యవసాయ ఉత్పత్తుల కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సంస్థతోనే ఎగుమతులు, దేశీయ వ్యాపారాలకు సరఫరా చేస్తుందని పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు.
గోధుమల ఎగుమతులపై ఉన్న పరిమితుల వల్ల రిలయన్స్‌కు దేశీయ మార్కెట్లోనూ అవకాశాలు కలిసి వచ్చాయి. రిలయన్స్ రిటైల్‌కు ఉన్న 15000 స్టోర్లలోనూ ప్రయివేటు లేబుళ్ల కోసం అహార ధాన్యాలను భారీగా కొనుగోలు చేస్తుంది. గత వారం హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గోధుమ నిల్వలను కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వం లక్ష టన్నుల గోధుమలను విక్రయించనుంది. ఇందులో కనీసం 5వేల టన్నులకు మాత్రమే బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. ఇంతక్రితం రిలయన్స్ తక్కువ మొత్తంలో కొనుగోలు చేసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ శక్తులు తిండి గింజల ఎగుమతులు, వ్యాపారాల్లోకి రావడం ద్వారా దేశంలో అహారోత్పత్తుల ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.