Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే ఆలస్యమైంది : జేడీ(యూ)
- బీజేపీ పాలనపై అసంతృప్తితో ఉన్నాం : మిగతా ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ : బీహార్‌లో బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిన జేడీ(యూ)..మణిపూర్‌లోనూ రాజకీయ పొత్తును తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పార్టీ ఎమ్మెల్యేలు, జాతీయస్థాయి నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని, ఎన్డీయే కూటమి నుంచి పూర్తిస్థాయిలో బయటకు రాబోతున్నామని మణిపూర్ జేడీయూ అధ్యక్షుడు కె.ఎస్.హెచ్.బీరేన్‌సింగ్ మంగళవారం మీడియాకు తెలిపారు. ''మద్దతు ఉపసంహరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. కానీ..కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది. అధికారికంగా త్వరలో ప్రకటన చేస్తా''మని బీరేన్‌సింగ్ అన్నారు. సెప్టెంబర్ 3-4 తేదీల మధ్య పాట్నాలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈమేరకు అగ్రనేతలతో సమావేశమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, ఈ భేటీకి మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలు సైతం హాజరవుతారని, సమావేశం అనంతరం అధికారికంగా ఒక ప్రకటన చేస్తామని తెలిపారు.
బీహార్‌లో ఎన్డీయే కూటమి నుంచి జేడీ(యూ) బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతోనూ పూర్తిస్థాయిలో రాజకీయ సంబంధాలు తెంచేసుకుంది. అయితే మణిపూర్‌లో ఎన్.బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వానికి మాత్రం మద్దతు కొనసాగుతూ వచ్చింది. వాస్తవానికి ఆగస్టు 10వ తేదీనే మణిపూర్ జేడీయూ యూనిట్ తెగతెంపులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే జేడీయూ కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో మణిపూర్‌లో బీజేపీతో పొత్తుపై ప్రకటన జాప్యం అవుతూ వస్తోంది. మణిపూర్ అసెంబ్లీలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా..బీజేపీ ఎమ్మెల్యేలు 32మంది ఉన్నారు. ఏడుగురు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందినవాళ్లుఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు, మిగతా ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ కూటమిలో చేరాయి. అయితే సంకీర్ణ కూటమి నుంచి జేడీయూ వైదొలగటం బీజేపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. మిగతాప్రాంతీయ పార్టీలు సైతం బీజేపీకి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తీరు చర్చనీయాంశమవుతోంది. మద్దతు తెలుపుతున్న పార్టీల ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మణిపూర్ బీజేపీ నేతల మధ్య కూడా సఖ్యత లేదు. కీలక నేత నిమారుచంద్ లువాంగ్ తన మద్దతుదారులతో కలిసి సోమవారం ఇంఫాల్‌లో జేడీయూ పార్టీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.