Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండుకుండల్లా శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలు
అమరావతి:శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవి నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో, అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల, ఇతర ప్రాంతాల నుంచి 2.94 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. ఇదే స్థాయిలో నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మరో 14 వేల క్యూసెక్కులను కాల్వలకు విడుదల చేస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు సాగర్‌కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగినా సాయంత్రం ఐదు గంటలకు తగ్గింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతలకు వచ్చింది. మంగళవారం ఉదయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీకి కూడా బుధవారం ఉదయం కల్లా వరద ఉధృతి తగ్గుతుందని భావిస్తున్నారు. నాగార్జున సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీ గరిష్ట నీటిమట్టం 57 అడుగులు కాగా, పూర్తి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. శ్రీశైలం జలాశయం రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. జూరాల డ్యాం గేట్ల ద్వారా 24,402 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి అనంతరం 43,245 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 78,584 క్యూసెక్కులు, హంద్రీ ద్వారా 117 క్యూసెక్కుల నీటితో కలిపి మొత్తంగా 1,46,348 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఈ జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత 884.400 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 215.4385 టిఎంసిలు కాగా, ప్రస్తుత 210.9946 టిఎంసిలుగా నమోదైంది. విద్యుదుత్పత్తి ద్వారా కుడి విద్యుత్తు కేంద్రం నుండి 31,421 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్తు కేంద్రం నుండి 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.