Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది స్వాధీనం చేసుకున్న నకిలీ సొమ్ములో : ఎన్సీఆర్బీ నివేదిక
న్యూఢిల్లీ : గతేడాది స్వాధీనం చేసుకున్న నకిలీ సొమ్ములో దాదాపు 60శాతం రూ.2వేల నోట్లేనని జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక పేర్కొంది. నకిలీ నోట్లను రద్దు చేయడమే ప్రధాన లక్ష్యంగా 2016లో పెద్ద నోట్లను రద్దు చేశారు. నకిలీ నోట్లు బాగా చెలామణిలో వుంటున్నందున వాటిని అణచివేయాలంటే పెద్ద నోట్ల రద్దు తప్పదని ప్రభుత్వం ఆనాడు పేర్కొంది. కానీ, ఆ తర్వాత నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం బాగా పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది. 2021లో భారత్లో నేరాలు శీర్షికతో ఈ నివేదికను వెలువరించారు. గత సంవత్సరం స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.20.39కోట్ల మేరకు నకిలీ నోట్లే వున్నాయి. ఇవన్నీ కూడా రూ.2వేల నోట్లే. పాత 500, వెయ్యి నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత 2వేల సంవత్సరంలో కొత్త 2వేలు, 500నోట్లు ప్రవేశపెట్టారు. 2016లో పట్టుకున్న నకిలీ కరెన్సీ రూ.15.92కోట్లు వుండగా, 2017, 18, 19, 20, 21ల్లో వరుసగా రూ.28.10, 17.95, 25.39, 92.17, 20.39కోట్లు వున్నాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు సంవత్సరం రూ.15.48కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 2020లో పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడడానికి కారణం పూనేలోని ఒక ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న డమ్మీ మనీనే. 2020 జూన్ 10న పోలీసులు 82.8కోట్ల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 43కోట్లు కేవలం రూ.2వేల నోట్లే వున్నాయి. పూణే ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నవే. ఇందుకు సంబంధించి ఆర్మీ అధికారితో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. డాలరు బిల్లులను రూపాయిల్లోకి మార్చుకునే సమయంలో డమ్మీ డబ్బును నిందితుడు ఉపయోగించేవారని పోలీసులు కనుగొన్నారు. 2021లో 6.6కోట్ల సొమ్ము 500రూపాయిల నకిలీ నోట్లలో వుందని,200రూపాయిల నకిలీనోట్లతో 45లక్షలు కూడా వున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.