Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో 8.28శాతం నమోదు
- గత 12 నెలల్లో ఇదే అత్యధికం
- హర్యానాలో అత్యధికం... ఛత్తీస్గఢ్ అత్యల్పం
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ రేటు మళ్లీ పెరిగింది. గత 12 నెలల్లో అత్యధికంగా ఆగస్టు నెలలో దేశంలో 8.28శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గురువారం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పట్టణ నిరుద్యోగ రేటు 9.57శాతం కాగా, గ్రామీణ నిరుద్యోగం 7.68శాతం నమోదైంది. దేశంలో అత్యధికంగా నిరుద్యోగ రేటు నమోదు అయిన రాష్ట్రాల్లో 37.3శాతంతో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది. 32.8శాతంతో జమ్మూ కాశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది. 31.4శాతంతో రాజస్థాన్, 17.3శాతంతో జార్ఖండ్, 16.3శాతంతో త్రిపుర, 13.7శాతంతో గోవా, 12.8 శాతంతో బీహార్ తరువాత స్థానాల్లో నిలిచాయి. మిగిలిన రాష్ట్రాలన్నీ జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటును నమోదు చేసుకున్నాయి. 0.4శాతంతో ఛత్తీస్గఢ్లో అత్యల్ప నిరుద్యోగ రేటు నమోదు కావటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 6.9శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. అయితే గత నెల (జూలై) కంటే ఇప్పుడు కాస్తా పెరిగింది. జూన్లో 10 శాతం ఉన్న నిరుద్యోగ రేటు, జూలై నాటికి 5.8 శాతానికి తగ్గింది. అది కాస్తా ఆగస్టులో 6.9 శాతానికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 6శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. అయితే ఏపీలో ఏప్రిల్ తరువాత ఇదే అత్యధికం. 2022 ఏప్రిల్లో 5.3 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, అక్కడ నుంచి ప్రతి నెల తగ్గుతూ వచ్చింది. కానీ మళ్లీ ఈ నెలలో నిరుద్యోగ రేటు పెరిగింది.