Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎమ్మెల్యేల గైర్హాజరు
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని ఢిల్లీ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. విశ్వాస తీర్మానానికి మద్దతుగా 58 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. ఈ ఓటింగ్‌లో బిజెపి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది శాసనసభ్యులుండగా, ఆప్‌కు 62 మంది, బిజెపికి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. ఆప్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు విదేశాల్లో ఉండగా, మరొక ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నారు. మిగిలిన 59 మందిలో ఒకరు స్పీకర్‌గా ఉన్నారు. ఆగస్టు 29న ఈ విశ్వాస తీర్మానాన్ని కేజ్రీవాల్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానంపై గురువారం మూజువాణీ, డివిజన్ పద్దతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్ సమయంలో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాతో బిజెపి ఎమ్మెల్యేలు వాదనకు దిగారు. విశ్వాస ఓటుపై చర్చకు ముందు సావధాన తీర్మానా నికి సంబంధించి తాము ఇచ్చిన నోటీసులు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్‌ను డిమాండ్ చేస్తూ నానా రభస సృష్టించారు. దీంతో ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను స్పీకర్ మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపారు. ఈ తరువాత మిగిలిన ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించిన అనంతరం అసెంబ్లీ హౌస్ వద్ద మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి యత్నించి భంగపడిందన్నారు. ఒక్క ఆప్ ఎమ్మెల్యే కూడా అటువైపు తొంగి చూడలేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంపై సిబిఐ దాడుల తరువాత గుజరాత్లో ఆప్ ఓట్ల శాతం నాలుగు శాతానికి పెరిగిందని, మనీష్‌ను అరెస్టు చేస్తే ఆరు శాతానికి పైగా పెరుగుతుందని చెప్పారు.