Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీక్‌లు ఇచ్చింది గవర్నర్ : జేఎంఎం, కాంగ్రెస్
- ఈ పరిస్థితిపై మీరే స్పష్టత ఇవ్వాలి : గవర్నర్‌కు లేఖ
న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి, అస్థిరతకు 'రాజ్‌భవన్' కేంద్రమైంది. సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు..అంటూ లీక్‌లు పంపిన గవర్నర్ రమేశ్ బాయిస్ ప్రస్తుత సంక్షోభానికి కారణమంటూ జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. రాజకీయ అస్థిరత తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఆరోపించింది. హేమంత్ సోరెన్‌పై రాజ్‌భవన్ నుంచి వచ్చిన లీక్‌లపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు గవర్నర్ రమేశ్ బాయిస్‌ను కలుసుకొని లేఖను సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన దానిపై గవర్నర్ స్పష్టత ఇవ్వాలని లేఖలో వారు కోరారు. ''ఉద్దేశపూర్వకంగా రాజ్‌భవన్ నుంచి కొన్ని లీక్‌లు వదిలారు. తద్వారా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రభుత్వ పాలన, ప్రభుత్వాన్ని బలహీనపర్చాలని చూశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాగుతున్న ప్రయత్నాలకు రాజ్‌భవన్ కేంద్రమైంది'' అని లేఖలో జెఎంఎం, కాంగ్రెస్ పేర్కొన్నది.
గవర్నర్‌ను కలుసుకొని బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు త్రికే మీడియాతో మాట్లాడారు. సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయటం లేదన్నారు. సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయబోతున్నారనే లీక్‌ను గవర్నర్ తిరస్కరించారు. ఎలాంటి లీక్లూ రాజ్‌భవన్ నుంచి వెలువడలేదన్నారు. అనర్హత వేటు అనేదానిపై త్వరలో స్పష్టత ఇస్తామని గవర్నర్ చెప్పారని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. రాజీనామా అనంతరం గవర్నర్‌తో భేటి అయి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని ఆయన కొరవచ్చు. ఈ విషయమై గురువారం రాత్రి సంకీర్ణ ప్రభుత్వ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. మొత్తం 81మంది సభ్యులు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో అధికార యూపీఏకి 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 30మంది ఎమ్మెల్యేలతో జార్ఖండ్ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా, కాంగ్రెస్‌కు 18మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల బలముంది.
జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణంలోని 34మంది ఎమ్మెల్యేలను మంగళవారం ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని భావించిన సోరెన్ వారిని మరో రాష్ట్రం తీసుకెళ్లాల్ని వచ్చింది. గురువారం సాయంత్రం 4 గంటలకు హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంతో భేటీ అయ్యారు. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేలు తిరిగి రాంచీ చేరుకున్నారు. 'ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్' కేసులో హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన ఈసీ తన నిర్ణయాన్ని గవర్నర్ రమేష్ బాయిస్‌కు పంపింది. దాంట్లో ఈసీ ఏమి చర్యలను సూచించిందనే విషయం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు.