Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కకు పెడుతున్న ప్రయివేటు ఆస్పత్రులు
ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)పై కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నది. తాము తీసుకొచ్చిన ఈ పథకం వైద్యం పరంగా దేశంలోని ప్రజలకెంతగానో ఉపయోగపడుతున్నదని ప్రచారం చేసుకుంటున్నది. ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు నాలుగు కోట్ల మంది ఉచిత వైద్య చికిత్సను పొందారని సాక్షాత్తూ ప్రధాని మోడీ చెప్పారు. దీని ద్వారా వారు ఖర్చు చేసే రూ. 50 కోట్లు ఆదా అయ్యిందన్నారు. అయితే, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు, కేంద్రం చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ పథకం కింద ఎంప్యానెల్ చేయబడిన ప్రయివేటు ఆస్పత్రులు పథకాన్ని దూరం పెడుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని పేద ప్రజలపై పడుతున్నది.
- తక్కువ ప్యాకేజీ రేట్లు కారణం ొ లబ్దిదారులకు ఇబ్బందులు
- బిల్లుల క్లియర్ విషయంలో ప్రభుత్వంపై కొరవడిన నమ్మకం
న్యూఢిల్లీ : ఆయుష్మాన్ భారత్ పథకం విషయంలో కేంద్రానికి ప్రయివేటు ఆస్పత్రులు ఝలక్ ఇస్తున్నాయి. తక్కువ ప్యాకేజీ చార్జీల కారణంతో ఈ పథకం పట్ల ఆసక్తి చూపటం లేదు. దీంతో కేంద్రం ఆశించినంత స్థాయిలో పథకం ముందుకెళ్లటం లేదు. ప్రయివేటు ఆస్పత్రులు పథకాన్ని దూరం పెట్టటంతో లబ్దిదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పథకం కింద ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే ప్రజలు వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం ప్రయివేటు ఆస్పత్రులతో చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం జరగలేదు. గతంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలలో సర్కారు బకాయిపడిన బిల్లుల విషయాన్ని పెద్ద ప్రయివేటు ఆస్పత్రులు ప్రస్తావించటం గమనార్హం.
ఉచిత, నగదు రహిత వైద్య చికిత్సల కోసం ఆయుశ్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)ను కేంద్రం 2018-19లో తీసుకొచ్చింది. పది కోట్ల పేద కుటుంబాలు లేదా 50 కోట్ల మందికి లబ్ది కలిగించేలా.. ప్రతి కుటుంబానికి ఏడాది ఆస్పత్రి వైద్య చికిత్స కోసం రూ. 5 లక్షల కవరేజీ కల్పించటం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఈ పథకాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) నిర్వహిస్తుంది.
ఈ పథకంలో చేరాలని దేశంలోని అనేక ప్రయివేటు ఆస్పత్రులను కేంద్రం ప్రేరేపిస్తున్నది. ఇందుకు అనేక ప్రయత్నాలనే చేస్తున్నప్పటికీ ప్రయివేటు ఆస్పత్రుల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన లేదు. ఈ పథకం కింద అనుమతి చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయంటూ పథకానికి దూరంగా ఉంటున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం పీఎంజేఏవై 25 వేల ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల నెట్వర్క్ను కలిగి ఉన్నది. ఇందులో ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రులు రెండూ ఉన్నాయి. ప్రయివేటు ఆస్పత్రుల వాటా 42 శాతం (11,000) ఉన్నది. 27 స్పెషాలిటీలలో దాదాపు 2000 చికిత్స విధానాలను వారు అందిస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 3.7 కోట్లకు పైగా ఆస్పత్రి అడ్మిషన్లకు రూ. 45 వేల కోట్ల ఖర్చు జరిగింది.
''పెద్ద సంఖ్యలో ప్రయివేటు ఆస్పత్రులను చేర్చటం అనేది ఎన్హెచ్ఏ లక్ష్యం. ఇటీవల ఆరోగ్య మంత్రి ఈ ప్రక్రియను సమీక్షించారు. ప్రయివేటు ఆస్పత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. పీఎంజేఏవై పథకంలో భాగం కావాలని వారిని ప్రోత్సహించారు'' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. పీఎంజేఏవై కింద ఎంప్యానెల్ చేయాలని మరిన్ని ఎక్కువ ఆస్పత్రులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. '' అనేక ప్రయివేటు ఆస్పత్రులలో చికిత్స ప్యాకేజీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రయివేటు ఆస్పత్రులలో చాలా వరకు ఆసక్తి చూపకపోవటానికి ఇదే కారణం'' అని మరొక అధికారి తెలిపారు. ''ప్రభుత్వం ఇటీవల మమ్మల్ని ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్)తో మా అనుభవాన్ని నేను ఉదహరించాను. ఇక్కడ చాలా ఆస్పత్రులకు తమ బిల్లులు క్లియర్ కాలేదు. అలాగే, పీఎంజేఏవై విషయంలో చాలా పెద్ద ఆస్పత్రులు తమ బిల్లులు సకాలంలో క్లియర్ అవుతాయనే నమ్మకంతో లేవు'' అని అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (ఏహెచ్పీఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిదర్ గ్యాని అన్నారు. ''పీఎంజేఏవై కింద ఎంప్యానెల్ అయిన చాలా ప్రయివేటు ఆస్పత్రులు చిన్న ఆస్పత్రులు. పీఎంజేఏవైకి పెద్ద ప్రయివేటు ఆస్పత్రులు అవసరం. ఎందుకంటే, చిన్న ఆస్పత్రులు తృతీయ సంరక్షణ విధానాలను అందించలేవు. అంతేకాకుండా, చాలా చిన్న ఆస్పత్రులకు ప్రోత్సాహకాలు లభించటం లేదు. పీఎంజేఏవై కూడా చాలా తక్కువ ప్యాకేజీ రేట్లను సవరించాలి'' అని చెప్పారు.