Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్
- స్వాగతించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమకారిని తీస్తా సెతల్వాద్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2002 గోద్రా అల్లర్ల కేసుల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సహా ఉన్నతాధికారులను ఇరికించేందుకు కల్పిత పత్రాలను రూపొందించారని ఆరోపిస్తూ తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. సెతల్వాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు సుదీర్ఘంగా వాయిదా వేయగా... ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.
'మా దృష్టిలో తీస్తా సెతల్వాద్ బెయిల్‌పై విడుదలకు అర్హులు. హైకోర్టులో కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. కాబట్టి, సెతల్వాద్ బెయిల్‌పై విడుదల చేయాలా? వద్దా? అనే విషయాన్ని మేం పరిగణించడం లేదు. అది హైకోర్టు నిర్ణయిస్తుంది. అయితే ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం' అని ధర్మాసనం ఆదేశించింది. 'పిటిషన్‌దారు ఒక మహిళ జూన్ 25 నుంచి కస్టడీలో ఉన్నారు. ఆరోపించిన నేరాలు 2002-2012 మధ్య కాలానికి సంబంధించినవి. 2012 నాటి సంబంధిత డాక్యుమెంట్లలో ఉత్తమంగా అతని వాదనలు ఉన్నాయి'' అని కోర్టు పేర్కొంది. ''సెతల్వాద్‌ను సంబంధిత కోర్టు ముందు హాజరుపరచాలి. కోర్టు తగినట్లుగా షరతులతో ఆమెను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. ఆమె బెయిల్ దరఖాస్తును హైకోర్టు నిర్ణయించే వరకు అప్పీలుదారు సంబంధిత కోర్టులో ఆమె పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి' అని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సెతల్వాద్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఎస్జీ ఉదహరించిన సాక్షుల వాంగ్మూలాలతో సహా వాదనలను తిప్పికొట్టారు. ఆమెకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వాస్తవాలు జూన్ 24 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిన ప్రొసీడింగ్ల పునరావృతం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. తీస్తాపై ఆరోపించిన నేరం కూడా రుజువు కాలేదని వాదించారు. అదే న్యాయమూర్తి వద్ద 28 విషయాలు జాబితా తన వద్ద ఉందని, కొద్ది రోజుల్లో బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు.
ఆమె ఎలాంటి తప్పు చేయలేదు : సీపీఐ(ఎం)
తీస్తా సెతల్వాద్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సీపీఐ(ఎం) స్వాగతించింది. 'ఈ ఉత్తర్వు గుజరాత్ హైకోర్టు విచారణను ఆలస్యం చేయడానికి చేసిన అన్యాయాన్ని ప్రస్తావించిందని పేర్కొంది. తీస్తాకు సీపీఐ(ఎం)సంఘీభావం తెలిపింది. మత హింస బాధితులకు న్యాయం కోసం పోరాడడం తప్ప, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు'' అని పేర్కొంది.