Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి రేటు తగ్గిందన్న సీఎంఐఈ నివేదికపై సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: దేశంలోని యువతకు ఉపాధి లేకపోవడానికి మోడీ సర్కార్ విధానాలే కారణమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. గత ఐదేండ్లలో దేశంలో యువత ఉపాధి రేటు సగానికి సగం పడిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై ఏచూరి స్పందించారు. దేశ యువత శ్రమ శక్తిని మోడీ సర్కార్ నాశనం చేసిందని ఏచూరి విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయడమే ఈ దుస్థితికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇది దీర్ఘకాల ప్రభావాలు చూపుతుందని స్పష్టం చేశారు. మోడీ సన్నిహితులకు పన్ను రాయితీలు, రుణ మాఫీలు ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ కల్పనకు ప్రభుత్వ పెట్టుబడి (పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్) అవసరమని తెలిపారు. అయితే మోడీ సర్కార్ ప్రభుత్వ పెట్టుబడి పెంచకుండా, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందని తెలిపారు.
యువత ఇంకెంత కాలం ఎదురుచూడాలి : వరుణ్ గాంధీ
ఉద్యోగాల కోసం... యువత ఇంకెంత కాలం ఎదురుచూడాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రశ్నించారు. సీఎంఐఈ డేటాను ఉటంకిస్తూ యువతలో ఉపాధి రేటు ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. 10 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రభుత్వ శాఖలను కోరారనీ, వాటిలో ఏ ఒక్కటీ ఇంతవరకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించలేదని తెలిపారు. యువత ఉపాధి రేటు 20.9 శాతం నుంచి 10.4 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు.
పొరుగు దేశాల కంటే యువత ఉపాధి రేటు తక్కువ
ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం, ఉత్తర అమెరికాలో 15-24 ఏండ్ల మధ్య వయస్సు గల యువకుల్లో సగానికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉత్తర అమెరికా సగటు ఉపాధి రేటు 50.6 శాతంగా ఉంది. 38 ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాలలో ఇది దాదాపు 42 శాతంగా ఉంది. యూరోపియన్ యూనియన్లో ఇది 33 శాతంగా ఉంది. పాకిస్థాన్లో 15-24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 38.9 శాతం మంది. బంగ్లాదేశ్లో 35.3 శాతం మంది ఉపాధి పొందుతున్నట్టు ప్రపంచ బ్యాంకు డేటా స్పష్టం చేస్తుంది. శ్రీలంకలో కేవలం 24.1శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. అదే భారతదేశంలో 23.2శాతం ఉంది. పొరుగు దేశాలతో పోల్చితే మన దేశంలో యువతకు ఉపాధి కల్పించడంలో చెత్త రికార్డును కలిగి ఉందని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేష్ వ్యాస్ తెలిపారు.