Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతికి అంకితం చేసిన ప్రధాని
తిరువనంతపురం : భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావడం విశేషం. ఈ నౌక నిర్మాణానికి సుమారు రూ.20వేల కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దీంతోపాటు భారత నౌకా దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రులు సర్బానంద సోనో తదితరులు పాల్గొన్నారు.
ఈ వాహక నౌకతో దేశీయ నౌకాదళం మరింత బలోపేతం కానుంది. భారత్ ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావడం గమనార్హం. సుమారు రూ.20,000 కోట్లతో భారత ప్రభుత్వం ఈ నౌకను నిర్మించింది. విక్రాంత్ డిజైన్‌ను భారత నౌకాదళంలోని వార్‌షిప్ డిజైన్ బ్యూరో తయారు చేసింది. ఈ నౌక నిర్మాణాన్ని కొచ్చిన్ షిప్ యార్డ్ పూర్తిచేసింది.ఈ యుద్ధ నౌకకు అవసరమైన స్టీల్‌ను ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్, డీఆర్డీవోలు సమష్టిగా అభివద్ధి చేశాయి.
ఐఎన్ఎస్ ప్రత్యేకతలు
262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 43,000 టన్నుల బరువు ఉంది. ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను పూర్తిగా దేశీయంగా తయారైన పరికరాలతో నిర్మించారు. రష్యా వేదికగా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య తరువాత ఐఎన్ఎస్ విక్రాంత్ దేశం యొక్క రెండవ విమాన వాహక నౌక కావడం విశేషం.
రెండు ఫుట్‌బాల్ మైదానాల అంత ఉండటంతో పాటు 18 అంతస్తులను కలిగి ఉంది. మిగ్ ఫైటర్ జెట్స్తో పాటు హెలికాఫ్టర్లను కూడా ఒకే సారి నిర్వహించగలదు.
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో 1600 మంది నావికా సిబ్బంది, 30 విమానాలు ప్రయాణించవచ్చు. గంటకు మూడు వేల చపాతీలు తయారు చేయగల యంత్రాలు ఈ వాహకనౌకలో ఉన్నాయి.
16 బెడ్లు కలిగిన ఆస్పత్రి, 250 ట్యాంకర్ల ఇంధనం, 2400 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారత్ నిలిచింది. అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా దేశాల సరసన భారత్ నిలిచింది.