Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా దాడులతో ఆర్ఎస్ఎస్కి సంబంధాలు !
- వెల్లడించిన ఆర్ఎస్ఎస్ మాజీ వాలంటీర్
- నాందేడ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంభవించిన పలు బాంబు పేలుళ్ళలో ఆర్ఎస్ఎస్కు ప్రమేయం వుందని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ మాజీ వాలంటీర్ యశ్వంత్ షిండె మహారాష్ట్రలోని నాందేడ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే లక్ష్యంతోనే ఇదంతా చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి షిండె వెలువరించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బాంబు పేలుళ్ల శిక్షణా కార్యక్రమానికి తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. బాంబు పేలుళ్లకు సంబంధించిన బహిరంగ రహస్యాలను ఈ అఫిడవిట్ వెల్లడిం చింది. అఫిడవిట్లో వివరాలు భయపెట్టేలా వున్నాయి. అధికారాన్ని సాధించేందుకు ఎంతకైనా తెగించగలరనిపించేలా వుంది. ఆగస్టు 30న షిండె ఈ అఫిడవిట్ దాఖలు చేసినట్లు ముస్లిం మిర్రర్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆర్ఎస్ఎస్ బాంబులను పేల్చిందని షిండె చెప్పారు. 1990లో, తాను మహారాష్ట్రలో వున్నప్పుడు, పోరాట స్ఫూర్తి బాగా వున్న కొంతమంది యువకులను పట్టుకోవాల్సి ందిగా ఇంద్రేష్ కుమార్ తనను కోరారని, వారిని జమ్మూ తీసుకువస్తే, అక్కడ ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో వారికి శిక్షణ ఇస్తారని చెప్పి నట్లు అఫిడవిట్ పేర్కొంది.
''ఇందుకోసం యువకుల ను ఎంపిక చేసేందుకు థానేలో వీహెచ్పీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో, షిండెకు నాందేడ్కి చెందిన హిమాంశు పన్సే పరిచయమయ్యాడు. ఆ సమయంలో హిమాంశు, గోవాలో వీహెచ్పీ పూర్తిస్థాయి కార్యకర్తగా పని చేస్తున్నాడు. అతడిని, ఆతడి స్నేహితులు ఏడుగురి ని ఈ శిక్షణ కోసం ఎంపిక చేశాం. వారిని షిండె జమ్మూకు తీసుకెళ్లాడు. భారత సైనిక జవాన్ల నుంచి వచ్చిన ఆధునిక ఆయుధాలతో అక్కడ వారికి శిక్షణ ఇవ్వబడింది..'' అని అఫిడవిట్ పేర్కొంది. బాంబు పేలుళ్ల ప్రాజెక్టులో భాగస్వామ్యమైన పలువురు వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ సభ్యుల పేర్లను ఆ అఫిడవిట్లో ఆయన వెల్లడించారు. ఈ పేలుళ్ల వెనక ముగ్గురు ముఖ్య వ్యక్తులు సూత్రధారులుగా వున్నారని షిండె వివరించారు. హిందూత్వను తీవ్రంగా విశ్వసించే వ్యక్తిగా తనను తాను షిండె చెప్పుకున్నారు. ఇంద్రేష్ కుమార్, హిమాంశు పన్సేలతో పాటుగా మిలింద్ పరాండె, రాకేష్ ధావడె, రవి దేవ్ (మిథున్ చక్రవర్తి) ఈ కేసులో ప్రధాన కుట్రదారులుగా పేర్కొన్నారు. బాంబులు తయారు చేయడంలో మిథున్ చక్రవర్తి శిక్షణ ఇచ్చేవారని షిండె తెలిపారు. హేయమైన ఈ నేరాల్లో తాను పాల్గొనాలని తనకు అనిపించ లేదన్నారు. తనతో సంబంధమున్న వారిని నిరుత్సాహపరిచేవాడినని చెప్పారు. ఈ పేలుళ్ల వల్ల బీజేపీ రాజకీయంగా అనుకున్నంత లబ్ది పొందలేదన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత మిలింద్ పరాండె వంటి వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ నుండి రహస్యంగా వారు కుట్రలు పన్నేవారని, అవన్నీ 2014 ఎన్నికల్లో దోహదపడ్డాయన్నారు. 2006 నాటి నాందేడ్ బాంబు పేలుళ్ల కేసులో పైన పేర్కొన్న ముగ్గురు ప్రధాన కుట్రదారులని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆ అఫిడవిట్ కోరింది.