Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్ముకాశ్మీర్లో మహిళలపై పెరుగుతున్న నేరాలు
జమ్ము : భూతల స్వర్గంగా పేరున్న జమ్ముకాశ్మీర్ నేరాలకు నిలయంగా మారుతోంది. ఈ ప్రాంతంలో మహిళలకు రక్షణ కరువుతోంది.అంతకు ముందు ఏడా దితో పోలిస్తే 2021లో జమ్ముకాశ్మీర్లో మహిళలపై నేరాలు 15.62 శాతం పెరిగాయి. 7 వేలకు పైగా మందిని అరెస్టు చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 'అయితే, కేవలం 95 మందికి మాత్రమే శిక్షలు ఖరారుకావడంతో నేరారోపణ రేటు తక్కువగా ఉంది. గత ఏడాది చివరి నాటికి దర్యాప్తులో ఉన్న కేసుల సంఖ్య 6,275కు చేరుకుంది. ఇందులో 2020 పెండింగ్ కేసులు 2,329, తిరిగి విచారణ ప్రారంభించిన కేసులు తొమ్మిది ఉన్నాయి' అని నివేదిక తెలిపింది. 2019 నుంచి 2021 వరకూ మహిళలపై నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని, 2019లో 3,069 కేసులు, 2020లో 3,405 కేసులు, 2021లో 3,937 కేసులు నమోదైనట్టు నివేదిక చెప్పింది.
2011 జనభా లెక్కల ప్రకారం జమ్ముకాశ్మీర్లో 64 లక్షల మంది మహిళలు ఉన్నారని, 2021లో లక్ష జనాభాకు నేరాల రేటు 61.6 శాతంగా ఉందని చెప్పింది. 2021లో 315 లైంగికదాడికి సంబంధించిన కేసులు, 1,414 లైంగికదాడి యత్నం, 14 కట్నం మరణాల కేసులు నమోదయ్యాయని నివేదిక తెలిపింది. 91 శాతం లైంగికదాడి కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారేనని చెప్పింది. అలాగే మహిళల గౌరవాన్ని కించపర్చే కేసులు 1,851 నమోదయ్యాయని తెలిపింది. వీటితో పాటు గృహహింస కేసులు, యాసిడ్ దాడుల కేసులు, గర్భస్రావం, శిశుహత్య, భ్రూణహత్య, మానవ అక్రమ రవాణా కేసులు కూడా గత ఏడాది వెలుగు చూశాయని నివేదిక తెలిపింది. గత ఏడాది మహిళల అపహరణ కేసులు 1,013 నమోదైనట్లు తెలిపింది. అలాగే 2021లో ఎస్సీఎస్టీ చట్టాలకు సంబంధించిన కేసులు 12, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించిన కేసులు తొమ్మిది నమోదైనట్లు నివేదిక తెలిపింది.