Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో 10మంది ఆర్టీఐ దరఖాస్తుదారులపై నిషేధాన్ని ఖండించిన నిపుణులు
- రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు
న్యూఢిల్లీ : గతేడాది జనవరి నుంచి 10మంది సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తుదారులపై గుజరాత్ సమాచార కమిషన్ (జీఐసీ) నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదంగా మారాయి. వీరిలో ఒకరిపై మినహా మిగిలిన తొమ్మిది మందిపై జీవిత కాల నిషేధం విధించడం మరింత గమనార్హం. జీఐసీ తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రస్తుత, మాజీ కేంద్ర సమాచార కమిషనర్లు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఇది సమాచార హక్కును 'పూర్తిగా అడ్డుకోవడమే'నని, తీవ్రమైన రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. జీఐసీ ఈ చర్యలు తీసుకోవడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులను రద్దు చేసిందనీ, ఇలాంటి చర్యలు 'నియంత చర్యలతో' సమానమని పేర్కొన్నారు. నేషనల్ క్యాంపైన్ ఫర్ పీపుల్స్ రైట్ టూ ఇన్ఫరేషన్ (ఎన్సీపీఆర్ఐ) అనే సంస్థ నిర్వహించిన ఒక వెబ్‌నార్‌లో వారు ఈ వాఖ్యలు చేశారు. 'సమాచార హక్కు చట్టం ఉపయోగించకుండా పౌరులపై నిషేధం విధించడం : సమాచార కమిషన్ల ఉత్తర్వుల చట్టబద్దతపై చర్చ' అనే పేరుతో ఈ వెబ్‌నార్ జరిగింది. ఇలాంటి నిషేధాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయనీ, అయితే 2005లో పార్లమెంట్ ఆమోదించిన సమాచార హక్కు చట్టంలో ఇలాంటి నియామాలు లేవని వారు పేర్కొన్నారు. 2017 జులైలో తొలిసారిగా పంజాబ్ సమాచార కమిషన్ ఒక దరఖాస్తుదారుడ్ని బ్లాక్లిస్టింగ్లో పెట్టిందని ఎన్సీపీఆర్ఐ ప్రతినిధి అంజలి భరద్వాజ్ గుర్తుచేశారు. అప్పటినుంచి దేశంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. 'సమాచారం బహిరంగంగా, పారదర్శకంగా ఉంటే ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావు ఉండదు' అని వ్యాఖ్యానించారు.
దరఖాస్తుదారులను నిషేధించడానికీ, వారికి సమాచారాన్ని తిరస్కరించడానికి సమాచార హక్కు చట్టం ఎక్కడా కమిషన్లకు అధికారం ఇవ్వలేదని భరద్వాజ్ చెప్పారు. ప్రభుత్వ అధికారుల నుంచి సమాచారం లేదా అవసరమైన పత్రాలను పొందేందుకు ప్రజలను సమాచార హక్కు చట్టం వీలు కల్పిస్తుందని ఆమె తెలిపారు. అయితే సమాచార హక్కు దరఖాస్తుల్లో ఒక శాతానికి కంటే తక్కువగా 'పనికిరానివి, చిరాకు తెప్పించేవి' కూడా ఉంటున్నాయని అన్నారు. సమాచార హక్కు దరఖాస్తుదారులపై నిషేధం విధించడానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహితి అధికార్ గుజరాత్ పహెల్ (ఎంఏజీపీ)కు చెందిన పంక్తి జోగ్ ఈ అంశంపై ఒక ప్రజేంటేషన్ ఇచ్చారు. డిసెంబరు 2020న గుజరాత్ సమాచార కమిషన్ తొలిసారిగా ఒక దరఖాస్తుదారున్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి 10మంది దరఖాస్తుదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ లేదా నిషేధం విధిస్తూ 15 ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. ఇందులో ఒక్క దరఖాస్తుదారుడిపై మినహా మిగిలిన అందరిపై జీవితకాల నిషేధం విధించినట్టు తెలిపారు.
విచారణ సమయంలో గట్టిగా అరవడం, ఎక్కువసార్లు దరఖాస్తు చేయడం వంటి చిన్న చిన్న కారణాలతోనూ నిషేధం విధించారని ఆమె ఆరోపించారు. ఈ వెబ్‌నార్‌లో మాట్లాడిన మాజీ, తొలి భారత సమాచార కమిషనర్ (సీఐసీ) వజహత్ హబిబుల్లా మాట్లాడుతూ సమాచార హక్కు అనేది రాజ్యంగబద్ధమైన హక్కు అని చెప్పారు. సమాచారం కోరకుండా ఒక పౌరుడిని నిరోధించే హక్కు సుప్రీంకోర్టుకు కూడా లేదనీ, అటువంటప్పుడు సమాచార కమిషన్‌కి లేదా కమిషనర్‌కి ఆ అధికారం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కోరకూడని సమాచారం అంటూ ఏమీలేదనీ, అడిగే ప్రతీ సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పారు. మరో మాజీ సీఐసీ శైలేష్ గాంధీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా ప్రాథమిక హక్కులను నిషేధించడానికి ప్రయత్నం చేయలేదనీ, జీఐసీ జారీ చేసిన ఉత్తర్వులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. మరో మాజీ సీఐసీ, మాజీ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ అజాద్ మాట్లాడుతూ జీఐసీ జారీ చేసిన ఉత్తర్వులు ఒక నియంత జారీ చేసిన ఉత్తర్వులుగా ఉన్నాయని విమర్శించారు. మధ్యప్రదేశ్ సమాచార కమిషన్ కమీషనర్ రాహుల్ సింగ్ మాట్లాడుతూ 'దరఖాస్తుదారులపై నిషేధం విధించడాన్ని 'ప్రమాదకరమైన ధోరణి'గా విమర్శించారు.