Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలపై మరో నిఘా !
- మోడీ సర్కార్ మరో వివాదాస్పద చట్టం..సీపీఐ
- నిరసనకారుల్ని అణచివేసేందుకే డాటా సేకరణ : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : కేంద్రం మరో వివాదాస్పద చట్టం 'క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్' (సీపీఐ) అమల్లోకి తీసుకొచ్చింది. మనదేశంలో పోలీసుల అధికారంపై ఇప్పటికే తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పాలకుల చేతిలో ఆయుధంగా పోలీస్ వ్యవస్థ మారిందన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు వివిధ చట్టాలు చేస్తూ నిరసనకారులు, విమర్శకుల గొంతును ప్రభుత్వాలు అణచి వేస్తున్నాయి. ఈ చట్టాన్ని ప్రయోగించి పోలీసులు ఎవర్నుంచి అయినా చేతివేలి ముద్రలు సేకరించటం, కంటి ఐరిష్ స్కానింగ్‌లు తీసుకోవచ్చు. ఈ సమాచారాన్ని పోలీస్ యంత్రాంగం దాదాపు 75 సంవత్సరాలపాటు నిల్వ చేయనున్నది. ఈ డాటాను నేర పరిశోధనలో ఇతర ఏజెన్సీలతో పంచుకుంటా మని కేంద్రం చెబుతోంది. అయితే ఈ చట్టం చేయటంలో అనేక లొసుగులున్నాయని సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ చెబుతున్నారు.
''సీపీఐలో వివాదాస్పద అంశాలు న్నాయి. అరెస్టు అయిన నిందితుడు దోషిగా తేలనప్పటికీ...అతడి నుంచి బయోమెట్రిక్ డాటాను పోలీసులు సేకరిస్తారు. ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 'ఫేసియల్ రికగేషన్ సిస్టం'ను కొన్నేండ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చాయి. ఎలాంటి చట్టం లేకుండానే ప్రజలందరిపైనా నిఘాను అమలుజేస్తున్నాయి'' అని పవన్ దుగ్గల్ అన్నారు. బయోమెట్రిక్ డాటా సేకరణ ద్వారా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు కచ్చితంగా భంగం ఏర్పడుతుందని, సున్నితమైన వ్యక్తిగత డేటా పంచుకోవటం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీపీఐ...నేర న్యాయవ్యవస్థలో సరికొత్త పాలన, నిర్మాణాన్ని, వ్యక్తుల హక్కులను అసమానంగా ప్రభావితం చేస్తుందని క్రిమినల్ న్యాయవాది రెబెక్కా మమ్మెస్జాన్ అన్నారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించవచ్చునని ఆమె హెచ్చరించారు.
''ఈ బయోమెట్రిక్ డేటా బేస్‌లు దుర్వినియోగం అయినా, విక్రయించినా బాధ్యులు ఎవరు? అమాయక వ్యక్తులను వేధించకుండా చట్టంలో ఎలాంటి రక్షణలున్నాయి?'' న్యాయవాది రెబెక్కా ప్రశ్నించారు.