Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూర్పు లడఖ్‌లో సైనిక బలగాలను ఉపసంహరించుకుంటున్న భారత్, చైనాలు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ గోగ్రా - హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి తమ సైనిక బలగాలు వైదొలగడం ప్రారంభమైందని భారత్, చైనాలు గురువారం ప్రకటించాయి. 2020 మే నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా ఇదొక ముందడుగుగా భావిస్తున్నారు. ఉజ్బెకిస్తాన్‌లో వచ్చే వారం జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతున్నారు. ఆ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సదస్సులో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా? లేదా? అనేది ఎవరూ ఇంతవరకు నిర్ధారించలేదు. 2019 నవంబరులో బ్రసీలియాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇరువురు ముఖాముఖి మాట్లాడుకోలేదు. భారత్, చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి 16వ దఫా సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు భారత్, చైనా సైనిక బలగాలు సమన్వయంతో కూడిన, ప్రణాళికాబద్ధమైన రీతిలో గోగ్రా - హాట్‌స్ప్రింగ్స్ నుంచి వైదొలగడం ప్రారంభమైంది. ఇది సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, భద్రతలకు అనుకూలమైన అంశం'' అని ఇరు పక్షాలు గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఏడాది జులై 17న 16వ దఫా సమావేశం జరిగింది. 2020 మేలో ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్నప్పటి నుంచి ఇరు పక్షాలు ఉద్రిక్తతల పరిష్కారానికి 16 దఫాలు చర్చలు జరిపాయి. ఇంకా డెమ్చాక్, డెప్సాంగ్ ప్రాంతాలు ఉద్రిక్తతలకు నెలవైన ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రస్తుత ప్రతిష్టంభనలో అవి భాగం కాదని, అందువల్ల అక్కడ నుంచి సైనిక బలగాలు వైదొలగే ప్రసక్తి లేదని చైనా చెబుతోంది. మార్చిలో 15వ దఫా చర్చలు జరిగిన వెంటనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత జులైలో బాలిలో జి20 సమావేశం సందర్భంగా వాంగ్, జై శంకర్ భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ పొడవునా నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ప్రతిష్టంభన కొనసాగినంత కాలమూ సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉండదని భారత్ పదేపదే స్పష్టం చేస్తూ వస్తోంది. వాస్తవాధీన రేఖ పొడవునా యథాతథ స్థితిని పునరుద్ధరించాలని కోరుతోంది. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఇరు పక్షాలు 50వేల మందికి పైగా సైనికులను, భారీ యుద్ధ సామాగ్రిని మోహరించడాన్ని కొనసాగిస్తున్నాయి.