Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఫిర్యాదులు
- వైరస్ వ్యాప్తిపై పంజాబ్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన
న్యూఢిల్లీ: వరి పంట ఎదగకుండా 'మరుగుజ్జు'గా మార్చే వైరస్ కొత్తగా మనదేశంలో వ్యాప్తి చెందుతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ను మోసుకొచ్చే కీటకం భారత్‌లో ఎప్పట్నుంచో ఉందని, అయితే వైరస్దాడితో వరి పంట ఎదుగుదల ఆగిపోవటం అన్నది మొదటిసారి అని పంజాబ్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన తాజాగా వెల్లడించింది. దీంట్లో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. మరుగుజ్జు వైరస్ మనదేశంలోని వరి బెల్ట్‌కు ఎలా వ్యాపించిందన్నదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్‌ను మోసుకెళ్లే తుఫాన్లు, ఊష్ణప్రసరణ గాలులు కారణం అయ్యి ఉండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరుగుజ్జు వైరస్ మొదట చైనాలో కనుగొన్నారని, దీని ఉనికి చాలాకాలంగా భారత్‌లో ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త మన్దీప్ సింగ్ హుంజన్ అన్నారు. చైనాలో ఎప్పట్నుంచో ఉన్న ఈ వైరస్..పంజాబ్, హర్యానాలోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు.
పంట నష్టం సమస్యను పరిష్కరించటం, పంటలను కాపాడటం, వైరస్‌తో కలిగే వ్యాధిని కనుగొనటం తమ పరిశోధనలో ప్రాధాన్యత గల అంశమని డాక్టర్ హుంజన్ అన్నారు. పంజాబ్ వ్యవసాయ వర్సిటీ అదనపు పరిశోధన డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎస్.దత్ ఇటీవల వైరస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''జులైలో వరి మొక్కలు కుంగిపోయినట్టు వ్యవసాయ వర్సిటీకి ఫిర్యాదులు రావటం మొదలయ్యాయి. అదే నెలలో పంజాబ్, ఇతర పొరుగు రాష్ట్రాల నుండి ఇటువంటి ఫిర్యాదులే వస్తున్నాయి'' అని చెప్పారు. వైరస్ సోకిన తర్వాత వరి మొక్కల మూలాలు దెబ్బతింటున్నాయి. మొక్కలు వాడిపోతున్నాయి. అన్ని వరి రకాలపై వైరస్ తన ప్రతాపం చూపుతోందని పరిశోధన అభిప్రాయపడింది. వరి పంటను క్రమం తప్పకండా పర్యవేక్షించాలని, నివారణా చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చునని రైతులకు సూచించారు.