Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ అధికారిపై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ : మాంసాహారం తినొచ్చనీ, ఈ విషయం రుగ్వేదంలోనూ ఉందని అన్నందుకు ఓ సీనియర్ అధికారిని జమ్ముకాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం సస్పెండ్ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందంటూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. పంచాయత్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ రషీద్ కొహ్లీ ని రాజౌరీ జిల్లా మెజిస్ట్రేట్ వికాస్ కుండల్ మంగళవారం రాత్రి సస్పెండ్ చేశారు. ప్రత్యేకంగా ఒక మతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, దీంతో కొహ్లీపై చర్యలు తీసుకోవాల్సిందిగా నలుగురు సబార్డినేట్స్ తన కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు మెజిస్ట్రేట్ తెలిపారు. కొహ్లీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని భగం చేసేందుకు యత్నించారని పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. అబ్దుల్ రషీద్ కొహ్లీతో కలిసి నలుగురు గ్రామస్థాయి వర్కర్స్ (వారిలో ఇద్దరు, హిందువులు కాగా, మరో ఇద్దరు ముస్లింలు) రాజౌరీలోని రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారి మధ్య మాంసాహారంపై చర్చ జరిగింది. కొహ్లీ మాట్లాడుతూ.. మాంసాహారం తినేందుకు రుగ్వేదం అనుమతిస్తుందని ఇంటర్నెట్లో చదివాననీ, మీరుకూడా తినవచ్చని ఆ ఇద్దరు హిందువులకు సూచించారు. తన మాటలతో అతను మనస్తాపానికి గురయ్యారని తాను భావించలేదనీ, లేకుంటే అప్పుడే క్షమాపణలు చెప్పేవాడినని కొహ్లీ అన్నారు. అతనిని కించపరచాలని తాను అనుకోలేదని... మామూలుగానే మాంసాహారం తినవచ్చని కోరానని చెప్పారు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 153 (ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం) కింద కేసు నమోదైనట్టు మీడియా తెలిపింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక బిజెపి నేత విభోద్ గుప్తా కూడా ఫిర్యాదు చేసినట్లు వివరించింది. మీరెందుకు మాంసాహారం తినరని ఇద్దరు హిందూ సబార్డినేట్స్పై కొహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడని బీజేపీనేత పేర్కొనడం గమనార్హం.