Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ మదన్ బి లోకూర్
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయడం విస్మయానికి గురిచేసిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాఖ్యానించారు. గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విధానంపై లోతైన విచారణ చేపట్టాల్సి వుందని అన్నారు. ఈ వ్యవహారంపై గుజరాత్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ నిందితులకు ఉపశమనం కల్పించడం భారత్లో మహిళా హక్కులకు అగ్నిపరీక్షగా నిలిచిందని మండిపడ్డారు. బిల్కిస్ బానో కేసు నిందితుల విడుదలతో నిందితులకు శిక్ష పడటంతోనే బాధితులకు న్యాయం జరిగినట్లు కాదనే సందేశాన్నిచ్చిందని అన్నారు. దీంతో మహిళలకు న్యాయం దక్కాలంటే చాలా కాలం పడుతుందని అన్నారు. ఈ ఘటన ప్రభుత్వాల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయవ్యవస్థ వారి హక్కులకు రక్షణగా నిలుస్తుందనడాన్ని ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. పైగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున హత్యలకు పాల్పడిన వారిని, రేపిస్టులను విడుదల చేయడం మరింత దిగజార్చిందని అన్నారు. బిల్కిన్ బానోకు న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ఉన్నానని జస్టిస్ లోకూర్ పేర్కొన్నారు. అయితే విడుదల ఆదేశాలు పబ్లిక్ డొమైన్లో లేనందున, ఏ కారణాల అధారంగా కమిటీ నిందితులను విడుదల చేసిందో తెలియదని.. దీనిపై వ్యాఖ్యానించలేమని అన్నారు. 11 మంది నిందితులకు ఒకే సారి క్షమాభిక్ష మంజూరు చేయడానికి ప్రాథమికంగా బలమైన సమర్థన అవసరమని, అందువల ఆ ఆదేశాలను చూడాల్సి వుందని అన్నారు. ఈ ఘటన సామాజిక -రాజకీయ వివాదాలకు తెరలేపిందని అన్నారు. ఇటువంటి క్రూరమైన, హీనమైన కేసుల్లో నిందితులకు ఉపశమనం కల్పించడం సమాజానికి మరింత ప్రమాదకరంగా మారుతుందని, ఇతర నేరస్తులను, దోషులను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇది మహిళల స్థాయిని తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. బాంబే హైకోర్టు మాజీ జడ్జి యుడి సాల్వే, మాజీ సుప్రీంకోర్టు జడ్జి దీపక్ గుప్తాలు కూడా నిందితుల విడుదలను ఖండించారు.