Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 132వ స్థానానికి పడిపోయిన వైనం
- మన కంటే శ్రీలంక, చైనా, బంగ్లా, భూటాన్ లు బెటర్:
ఐక్యరాజ్యసమితి నివేదిక
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీ (హెచ్డీఐ)లో భారత ర్యాంకు మరోసారి దిగజారింది. 2021లో 191 దేశాలకు గానూ భారత్ 132వ స్థానానికి పడిపోయింది. అంతకముందు ఏడాదితో పోలిస్తే ఒక స్థానం పడిపోవటం గమనార్హం. పొరుగుదేశాలు శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ లు భారత్ కంటే మెరుగైన ప్రదర్శనను కనబర్చాయి. ఐక్యరాజ్య సమితి సర్వే నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆయా దేశాల పౌరులు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం, జ్ఞాణ సముపార్జన, మంచి జీవన ప్రమాణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దీనిని రూపొందించారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. 2020లో భారత మానవాభివృద్ధి సూచిక 0.642గా ఉన్నది. అది 2021లో 0.633కి పడిపోయింది. 1990 నుంచి భారతదేశ మానవాభివృద్ధి సూచీ ప్రతి ఏడాదీ మెరుగుపడింది. అయితే, 2020లో సూచిక 0.003 పాయింట్లకు పడిపోయింది. 2021లో 0.009 పాయింట్ల పదునైన క్షీణతను చూసింది. భారత్లో 2020లో ఆయుర్దాయం 70.1 సంవత్సరాల నుంచి 2021లో 67.2కి క్షీణించిన కారణంగా ర్యాంకు పడిపోయింది. ''1990, 2021 మధ్య భారత ఆయుర్ధాయం 8.6 ఏండ్లు, పాఠశాల విద్య సగటు సంవత్సరాలు 3.9 ఏండ్లు, పాఠశాల విద్య 3.9 ఏండ్లు మారాయి'' అని నివేదిక వివరించింది. మానవాభివృద్ధి సూచిక విషయంలో పొరుగు దేశాలు భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. శ్రీలంక (73వ స్థానం), చైనా (79), బంగ్లాదేశ్ (129), భూటాన్ (127) వంటి దేశాలు భారత్ కంటే చక్కటి ప్రదర్శనను కనబర్చాయి. పాకిస్థాన్ (161వ స్థానం), నేపాల్ (143), మయన్మార్ (149) దేశాలు దారుణ ప్రదర్శనను కనబర్చాయి. స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. నార్వే, ఐస్లాండ్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ సూడాన్, చాద్, నైజర్ దేశాలు అట్టడుగున నిలిచాయి.