Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దఎత్తున అప్పులు చేసి పిల్లల్ని విదేశాలకు పంపుతున్న తల్లిదండ్రులు
- ఈ ఏడాది మొదట్లో విదేశాలకు..10లక్షల మంది విద్యార్థులు
- కోవిడ్ సంక్షోభం తర్వాత భారీగా పెరిగిన ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మార్కెట్
- ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవటం వల్లే : రాజకీయ విశ్లేషకులు
- ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో నియామకాలు తగ్గాయి..
న్యూఢిల్లీ : ప్రస్తుతం మనదేశంలో 30కోట్ల మంది విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు. రెండు..మూడేండ్లలో వీరంతా ఉన్నత విద్య కోసం సిద్ధమవ్వాల్సిందే. అయితే దేశంలో ఇంతమంది విద్యార్థులకు సరిపడా ఉన్నత విద్యా సంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు. కోవిడ్-19 సంక్షోభం తర్వాత ఉపాధిరంగంలో అనూహ్య మార్పులు వచ్చాయి. స్థిరమైన వేతనం, ఇతర ప్రయోజనాలతో కూడిన ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఏదేమైనా మనదేశంలో విద్య, ఉద్యోగం..అత్యంత గందరగోళంగా తయారైంది. ''ఇండియాను వదిలి..విదేశాల్లో అవకాశాలు వెతుక్కోవటం తప్ప మరో మార్గం లేదు'' అనే భావన మధ్య తరగతి కుటుంబాల్లో ఏర్పడింది. విదేశీ విద్య అవకాశాల్ని అందిస్తున్న 'ఓవర్సీస్ కన్సెల్టెన్సీల' వైపు చూడటం పెరిగింది. ప్రయివేటుగా అప్పులు చేసైనా పిల్లల్ని విదేశాలకు 3పంపుతున్నారు.
భవిష్యత్ అగమ్యగోచరం
పేరొందిన విద్యా సంస్థ నుంచి మంచి గ్రేడింగ్‌తో ఉన్నత విద్య పూర్తిచేసినా..ఇక్కడ భవిష్యత్తు అగమ్యగోచరం. దాంతో తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు, ఉపాధి కోసం పంపేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. బంధువులు, సన్నిహితుల నుంచి అప్పులు భారీమొత్తంలో చేస్తున్నారు. కనీసం అక్కడ ఏ చిన్న ఉద్యోగం లభించినా..ఆర్థికంగా స్థిరపడవచ్చుననే ఆలోచనతో ఉన్నారు. ఒకప్పుడు మెట్రో నగరాలకు పరిమితమైన 'ఓవర్సీస్ కన్సెల్టెన్సీలు' నేడు చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. ''భవిష్యత్తుకు సంబంధించి మన ఆలోచనలు, కలలు ఇక్కడ నెరవేరే పరిస్థితి లేదు. ఉన్నత చదువుల కోసం త్వరలో కెనడాకు వెళ్లబోతున్నా. బిజినెస్ మేనేజ్మేంట్లో రెండేండ్ల డిప్లొమా చేయడానికి వెళ్తున్నా. కోర్సు అనంతరం వర్క్ వీసా కూడా లభిస్తుంది'' అని హైదరాబాద్ చెందిన 19ఏండ్ల యువకుడు సచిన్ చెబుతున్నాడు. గ్రామాలు, పట్టణాల్లో సచిన్‌లాంటి యువకులు ఎంతోమంది ఉన్నారు. వారి ఆశలన్నీ విదేశాలతో ముడిపడి ఉండటం నేటి భారత్‌లో కొత్త పరిణామమని, ముఖ్యంగా ఇక్కడ మధ్య తరగతి ఆశలన్నీ అడియాసలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విద్యార్థుల సంఖ్య రెట్టింపు..
అనేక దేశాలు కోవిడ్-19 ఆంక్షలు ఎత్తేయటంతో భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐర్లాండ్, న్యూజీలాండ్..తదితర దేశాలకు పయనమవుతున్నారు. ఈ ఏడాది మొదట్లో దాదాపు 10లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్య కోసం వివిధ దేశాలకు వెళ్లిపోయారు. కోవిడ్ రాకముందు ఏడాదిదో పోల్చితే విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆంగ్ల భాషలో వెనుకబడిన విద్యార్థులకు కన్సల్టెన్సీలు కోచింగ్ తరగతులు సైతం ఏర్పాటుచేశాయి. వీసా దరఖాస్తు ప్రక్రయ, విమాన ప్రయాణం, పార్ట్-టైం ఉద్యోగం..మొదలైనవి చేసిపెడుతున్న కన్సెల్టెన్సీలు కూడా ఉన్నాయి.
భారీగా పెరిగిన ఎడ్యుకేషన్ మార్కెట్
ఆస్ట్రేలియాలో 76వేలమందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కత్రియోనా జాక్సన్ వెల్లడించారు. స్వల్పకాలిక కోర్సులు చేసే భారతీయ విద్యార్థుల సంఖ్య ఆస్ట్రేలియా, కెనడాలో అనూహ్యంగా పెరిగింది. భారత్‌లో విద్యా, ఉపాధి అవకాశాలు దెబ్బతినటం వల్లే విదేశాలకు మన యువత పయనమవుతున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మార్కెట్ 30 బిలియన్ డాలర్ల (సుమారుగా 2.3లక్షల కోట్లు) నుంచి 80 బిలియన్ డాలర్లకు(సుమారుగా 6.3లక్షల కోట్లు) పెరిగిందని 'రెడ్ సీర్' తెలిపింది. ఖరీదైన ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో విదేశీ వర్సిటీలు, భారత్‌లోని తమ భాగస్వాములతో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నాయి.